- పెస్టిసైడ్స్ వ్యతిరేక గళాలపై నిఘా
- అమెరికా కేంద్రంగా వి-ఫ్లూయెన్స్ సంస్థ నిర్వాకం
- అక్కడి ప్రభుత్వం నుంచి నిధులు
- భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సమాచార సేకరణ
- ఆ జాబితాలో సామాజిక, శాస్త్ర, పర్యావరణ, విద్యావేత్తలు
- ‘లైట్‌హౌజ్ రిపోర్ట్స్’ కథనం
న్యూఢిల్లీ : పెస్టిసైడ్స్ (పురుగుమందులు)కు వ్యతిరేకంగా గళమెత్తారో…మీ ఫోటో, పేరు, చిరునామా సహా సమస్త సమాచారం అమెరికాకు చేరిపోతుంది. అక్కడి నుంచే మిమ్మల్ని ఎలా నిలువరించాలి…ఎలా నిర్భందించాలనే వ్యూహరచన కూడా సాగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పెస్టిసైడ్స్, జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా గళమెత్తేవారందరి సమస్త సమాచారాన్ని రాబట్టేందుకు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పీఆర్ సంస్థ వి-ఫ్లూయెన్స్ ఈ నిఘా సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ విషయాన్ని లైట్‌హౌజ్ రిపోర్ట్స్ బట్టబయలు చేసింది. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. ప్రజల ఆరోగ్యాలను ప్రభావితం చేసే పెస్టిసైడ్స్, జన్యుమార్పిడి పంటలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించటం ఈ కంపెనీలకు వరంగా మారింది. అలాంటి కంపెనీలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు పోరాడుతున్నారు. రైతులు, ప్రజల తరఫున తమ గళాన్ని వినిపిస్తున్నారు. అయితే వారిని అణచివేసే చర్యలు అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమెరికా కేంద్రంగా ముస్సోరీకి చెందిన వి-ఫ్లూయెన్స్ ఇంటరాక్టివ్ సంస్థ ఈ అణచివేత చర్యల్లో పరోక్ష భాగస్వామిగా ఉందని లైట్‌హౌజ్ రిపోర్ట్స్ తెలిపింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ‘లైట్‌హౌజ్ రిపోర్ట్స్’ వార్త సంస్థ కథనం ప్రకారం వి-ఫ్లూయెన్స్‌కు గతంలో అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు అందాయి. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్ ఎయిడ్)లో గతంలో కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన జే బైర్నె వి-ఫ్యూయెన్స్‌ను 2001లో స్థాపించి నడుపుతున్నారు. ఈ సంస్థ ప్రపంచ ఆగ్రోకెమికల్, బయోటెక్నాలజీ ఇండిస్టీకి సమాచార సేకరణ, నిఘా పెట్టటం, ప్రొప్రైటరీ డేటా మైనింగ్, సమాచార విశ్లేషణలు చేయటం వంటి సేవలను అందిస్తుంది. భారత్‌లోని ప్రముఖ పర్యావరణవేత్త వందన శివ, జీవావరణ శాస్త్రవేత్త దేబాద్ దేబ్, ఇతర కీలక సైంటిస్ట్‌లు, విద్యావేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా సమాచారాన్ని వి-ఫ్యూయెన్స్ రూపొందించిన ఒక ప్రయివేటు సోషల్ నెట్‌వర్క్ కలిగి ఉన్నది. ఇందులో ఆగ్రోకెమికల్, బయోటెక్నాలజీ ఇండిస్టీకి చెందిన ఉద్యోగులు, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాని అనుబంధ రంగాలు భాగమై ఉంటాయి.
అయితే, వి-ఫ్లూయెన్స్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పెస్టిసైడ్‌లకు వ్యతిరేకంగా గళం వినిపించే ప్రముఖ వ్యక్తులలో ఆందోళన నెలకొంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి. ఆ సంస్థ సేకరించిన సమాచారం ఎలా వాడుకుంటుంది? ఎవరికిస్తుంది? గోప్యతను ప్రమాదంలో పడేస్తుందా? అన్న అనుమానాలు, భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు దిగ్గజ పెస్టిసైడ్ కంపెనీలతో సంబంధాలున్నాయి. ఇందులో కోర్టులో కేసును ఎదుర్కొంటున్న సింగెంట వంటి ఘరానా కంపెనీ కూడా ఉన్నది.
ఇక వి-ఫ్యూయెన్స్‌కు భారత్‌లో ఉన్న సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంస్థ ప్రయివేటు సోషల్ నెటవర్క్ బోనస్ ఈవెంటస్ వెయ్యికి మందికి పైగా యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. ఇందులో ప్రపంచ ఆగ్రోకెమికల్ కంపెనీలు, లాబీయిస్టులు, ప్రభుత్వ సభ్యులు కూడా ఉన్నారు. బోనస్ ఈవెంటస్ కోసం ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా అమెరికా నుంచి ఫండింగ్ అందుతున్నది. ఆసియా, ఆఫ్రికాలలో హానికర పెస్టిసైడ్స్‌పై వచ్చే విమర్శలను తిప్పికొట్టటమే లక్ష్యంగా ఇది పని చేస్తున్నది. 2019లో క్రాప్‌లైఫ్ సభ్యుల కోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని సైతం వి-ఫ్యూయెన్స్ ఏర్పాటు చేసింది. అలాగే, మూడేండ్ల తర్వాత ‘ఇండియా కెమ్ 2021’ కార్యక్రమాన్ని ఫిక్కీ నిర్వహించింది. ఇందులో రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా భాగమయ్యాయి. వి-ఫ్యూయెన్స్ అధ్యక్షుడిగా బైర్నె ఇందులో పాల్గొని మాట్లాడటం గమనార్హం.
అయితే, వి-ఫ్యూయెన్స్ వ్యవస్థాపకులు బైర్నె.. తన నెట్‌వర్క్ వ్యక్తుల సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు.