మరో కొండకు టెండర్‌

  • విశాఖ జిల్లా ఆనందపురంలో ఖనిజాల కోసం కొనసాగుతున్న గాలింపు
  • గ్రామసభ జరపకుండానే అడ్డగోలు క్వారీయింగ్‌కు సన్నాహాలు
  • పర్యావరణం, గిరిజనుల ఉపాధిపై పెను ప్రభావం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : మొన్న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని కుసులవాడ.. నేడు అదే మండలంలోని ఇచ్చాపురం.. విషయం ఒక్కటే.. కొండలను తవ్వేసి ఖనిజాలను దోచుకోవడమే. అటవీ ప్రాంతాల పర్యావరణాన్ని దెబ్బ తీసే కుట్రలను పాలకులు ఆపడం లేదు. ఇక్కడ ఎలాంటి గ్రామ సభనూ జరపలేదు. గిరిజనుల అభిప్రాయం తీసుకోలేదు. ఆ కొండపై క్వార్ట్‌జైట్‌ ఖనిజాల తవ్వకాలతో రూ.కోట్లకు పడగలెత్తి గిరిజనం ఉపాధిని దెబ్బకొట్టే కుట్రలకు ఓ కంపెనీ తాజాగా టెండరు వేసింది. ప్రకృతి సంపదలైన కొండలు, వాటిపై పోడు చేసుకుని ఉపాధి పొందే ఆదివాసీల హక్కులూ ఇలా అన్నీ ఇక్కడ ‘బుల్డోజ్‌’ అయిపోతున్నాయి.

ఆనందపురం గ్రామీణంపై కార్పొరేట్ల కళ్లు పడ్డాయి. ఇక్కడి కొండలను మైనింగ్‌ క్వారీయింగ్‌ కోసం అక్రమంగా అనుమతులు పొందడం కొనసాగుతోంది. అడ్డగోలుగా అనుమతులను మంజూరు చేయడంతో ఈ ప్రాంత గిరిజనం ఆవేశంతో అట్టుడికిపోతోంది. రాష్ట్రంలోని ‘టిడిపి కూటమి’ ప్రభుత్వం గిరిజన చట్టాలను పూర్తిగా గాలికొదిలేసింది. తాజాగా ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ పరిధిలోని ఇచ్చాపురం గ్రామంలో దెయ్యాలమెట్ట కొండపై ఇలాంటి కుట్రలకు ప్రభుత్వం తెర తీసింది. ప్రకృతి అందాలు, గలగల పారే సెలయేళ్లు, చుట్టూ కొండల నడుమగల ఇచ్చాపురం గిరిజన గ్రామం 55 గడపతో ఉంది. దీనికి సమీపంలోనే దెయ్యాలమెట్ట కొండతోపాటు కోతికొండ, మర్రిమెట్ట, ధారకొండ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన వాగులు, పచ్చని చెట్లు, జీడి, మామిడి తోటలు, పత్తి పంటలతో అలరారుతున్నాయి. నాలుగువైపులా ఉన్న కొండలు ఇచ్చాపురానికి రక్షణ కవచమనే చెప్పాలి.

కొండపై సర్వే రాళ్లతో గిరిజనంలో ఆందోళన

గత నెల 29న విజయవాడ మైనింగ్‌ డిపార్టుమెంట్‌, సర్వే అధికారులు ముగ్గురు ఇచ్చాపురంలోని దెయ్యాలమెట్ట కొండ దగ్గరకు కార్లలో వచ్చి కొండపై కొన్నిచోట్ల సర్వే రాళ్లు పాతి, మార్కింగ్‌ చేసి వెళ్లారు. ఆ క్రమంలోనే కొండను క్వారీయింగ్‌ చేయబోతున్నట్లు ఆ ప్రాంతంలోని వారితో చెప్పారు. ‘ప్రజాశక్తి’ ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కొండను తవ్వేసే కుట్రలపై ఆరా తీసింది. అక్కడి గిరిజనుల్లో తీవ్ర ఆందోళన కనిపించింది. ‘ప్రభుత్వాలు మమ్మల్ని బతకనివ్వవా?, కొండలను తీసేస్తారా?’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే మండలంలోని చిన్నయ్యపాలెంలో సర్వే నెంబర్‌ 104లో క్వార్ట్‌జైట్‌, రఫ్‌ స్టోన్‌, గ్రావెల్‌ తవ్వకాల కోసం గతంలో ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ముక్తకంఠంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడికి సమీప ప్రాంతంలో మరో కొండపై మైనింగ్‌ చర్యలు ప్రారంభమవడం ఇక్కడి వాసులను కలవరపరుస్తోంది.

టెండరు వివరాలు.. తాజాగా ఏం జరుగుతోంది ?

ఇచ్చాపురం గిరిజన గ్రామ సమీపంలోనే దెయ్యాలమెట్ట కొండ సర్వే నెంబరు 37/పిలో సుమారు 400 ఎకరాల వరకూ అంతా కొండే. ఇక్కడ దాదాపు 15 ఎకరాల్లో 2022 సెప్టెంబర్‌ 13న రాష్ట్ర డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ వద్ద ఇ-వేలంలో క్వార్ట్‌జైట్‌ నిక్షేపాల క్వారీయింగ్‌కు అనుమతులను పొందారు. అగ్నిసుముఖ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్లాన్‌ సమర్పించింది. కానీ, పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. 20 ఏళ్ల పాటు ఈ లీజు ఉంటుందని రాష్ట్ర మైనింగ్‌ శాఖ పేర్కొంది. మైనింగ్‌ ప్లాన్‌ను లీజుదారుకు అనుమతి వచ్చిన 2022 నుంచి మూడేళ్లలోపు ఎపి పొల్యూషన్‌ బోర్డు నుంచి, అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమ తులు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో అధికారిక బృందం ఇచ్చాపురం కొండకు విచ్చేసింది.

ఎమ్మెల్యే గంటా మద్దతు!

రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నాయకునికి సంబంధించిన వ్యక్తి ఈ కొండకు టెండరు వేశారు. స్థానిక (భీమిలి) ఎమ్మెల్యే గంటా ఆయనకు బంధువు కావడంతో గంటా, పిఆర్‌పి.నాయుడు, ఇంకొంతమంది ఇటీవల వచ్చి దెయ్యాలమెట్ట కొండను పరిశీలించి వెళ్లారు. దీనిని బట్టి ఇక్కడ మైనింగ్‌కు గంటా మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోందని ఈ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. గిరిజనుల ప్రయోజనాలను కాదని మైనింగ్‌ టెండర్‌దారులకు అండగా నిలవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకుంటామంటున్న గిరిజనం

‘కొండలపై పోడు ఒకపక్క, కొండల కింద ఉపాధి పనులు, జీడి మామిడి పంటలతో మరోపక్క ఉపాధి పొందుతున్న మా పొట్ట కొట్టాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూస్తున్నారు’ అని గిరిజన మహిళ కొప్పుల పైడమ్మ, బొప్పన యువరాజ్‌ ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు లేదని, గ్రామంలో లైట్లు వెలగవని, కానీ తమ సంపదల మీద మాత్రం పెద్దోళ్ల కళ్లు పడ్డాయని పేర్కొంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘మా కష్టం మాదే.. మా బతుకును, ఉపాధిని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు. కొండపై చెయ్యి పడితే సహించేది లేదు. అంటూ ప్రభుత్వాన్ని ఇక్కడి గిరిజనులు హెచ్చరిస్తున్నారు.

తవ్వకాల అనుమతులు రద్దు చేయాలి : సిపిఎం

దెయ్యాలమెట్టపై క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ తవ్వకాల అనుమతులను రద్దు ,చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిపిఎం భీమిలి డివిజన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇచ్చాపురం గ్రామంలో అడ్డగోలు, అక్రమ మైనింగ్‌ విషయం తెలిసి అక్కడ పర్యటించారు. సిపిఎం అండగా ఉంటుందని గిరిజనానికి భరోసా కల్పించారు. కొండకోనల్లో నివసించే గిరిజన హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్‌ చేశారు. అడ్డగోలుగా భూములు కొట్టేయడం దారుణమన్నారు. ఆయన వెంట పార్టీ మండల నాయకులు నాగరాణి ఉన్నారు.

➡️