పరీక్షలే ప్రధానం… సృజనాత్మకత మృగ్యం

Feb 4,2025 04:32 #beast, #Creativity, #Exams
  • కానరాని నైపుణ్యం, సమర్ధత
  • వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
  • ఎఎస్‌ఇఆర్‌ తాజా నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పరీక్షలే ప్రధానంగా ఉన్నాయని, సృజనాత్మకత మృగ్య మయిందని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్డ్‌ (ఏఎస్‌ఈఆర్‌) వెల్లడించింది. అభ్యాసంలో, గణితంలో కనీసం ప్రాథమిక నైపుణ్యం కూడా లేదని నివేదిక విమర్శించింది. విద్యా వ్యవస్థను కోవిడ్‌ తీవ్రంగా దెబ్బతీసిందని, దాని నుండి ఇప్పటికీ అది కోలుకోలేదని తెలిపింది. దీర్ఘకాల లాక్‌డౌన్‌, డిజిటల్‌ అభ్యాసం…ఈ పరిణామాలు గడచిన దశాబ్ద కాలంలో సాధించిన పురోగతిని వెనక్కి తీసికెళ్లాయని విమర్శించింది. ఏఎస్‌ఈఆర్‌ తాజా నివేదిక గత వారం విడుదలైంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని, తరగతి గదుల్లో విద్యా బోధన జరుగుతోందని ఆ నివేదిక తెలిపింది. అయితే లక్ష్యం వైపు ఇప్పుడే అడుగులు పడుతున్నాయని కూడా చెప్పింది.

పాఠ్యాంశాలకే పరిమితం

విద్యా బోధనలో రోజురోజుకూ సృజనాత్మకత పరిమితమవుతోంది. దేశంలోని చాలా మంది అధ్యాపకులు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితమవుతున్నారు. అసెస్‌మెంట్ల రూపకల్పనలో స్వతంత్రతను కోల్పోతున్నారు. విద్యార్థులను చదివించడం, పరీక్షలకు సంసిద్ధులను చేయడం వంటి పనులే కొనసాగుతున్నాయి తప్పించి తరగతి గదిని ఆవిష్కరణలు, మేధస్సుకు సానపెట్టే కేంద్రాలుగా మార్చలేకపోతున్నారు. పరీక్షలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ప్రతి విద్యార్థినీ తీర్చిదిద్దడమే అధ్యాపకుల పనిగా మారిపోయింది.

ఉపాధ్యాయుల కొరతతో పనిభారం

మౌలిక అభ్యాస వ్యవస్థకు కీలకమైన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ క్లాసులను బోధించే ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ ఉన్నా వారిలో నైపుణ్యం కొరవడుతోంది. దీనికితోడు తగినంత గౌరవం, వేతనం కూడా ఉండదు. పరిమిత వనరులతోనే విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలో నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్న అధ్యాపకులు లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో ప్రతి 27 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడో లేదా ఉపాధ్యాయురాలో ఉన్నారు. అయితే ఇందులోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. ఉదాహరణకు బీహార్‌లో 60 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒకే అధ్యాపకుడు బోధిస్తున్నారు. కేవలం ఒకే అధ్యాపకుడితో నెట్టుకొస్తున్న (ఏకోపాధ్యాయ) పాఠశాలలు దేశంలో 1.2 లక్షలు ఉన్నాయి. దీంతో వారిపై పని భారం పెరుగుతోంది. పైగా పరిపాలనా సంబంధమైన బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోంది. చాలా మంది ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి సమయం కూడా దొరకడం లేదు.

పెరుగుతున్న ఎస్సీ, ఎస్టీల ప్రవేశాలు

అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఒకటుంది. విద్యా వ్యవస్థలో భిన్నత్వం స్పష్టంగా కన్పిస్తోంది. ఉన్నత విద్యపై జరిపిన అఖిల భారత సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) తాజా నివేదిక ప్రకారం 2015-2021 మధ్యకాలంలో పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్న ఎస్సీల సంఖ్య 44 శాతం, ఎస్టీల సంఖ్య 66 శాతం పెరిగింది. నేడు తరగతి గదిలో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు కన్పిస్తుండడం విశేషం. వారి జీవిత అనుభవాలు కూడా సహజంగానే భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అనేక మంది విద్యార్థులకు వ్యక్తిగత పాఠాల ప్రణాళికలు అవసరమవుతాయి.

లోపిస్తున్న శిక్షణ, సమర్ధత

నేడు అధ్యాపకులలో చాలా మందికి ప్రత్యేక శిక్షణ లేదు. అట్టడుగు వర్గాల నుండి వచ్చిన విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ కనబరచి వారి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన వనరులూ లేవు. సాంస్కృతిక విభేదాలను సున్నితంగా పరిష్కరించే సమర్ధత కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో అనేక దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయులు పక్షపాత ధోరణులకు అతీతులేమీ కారని అవి నిరూపించాయి.

అధ్యాపకుల కోసం విద్యా కేంద్రాలు

అధ్యాపక శిక్షణా సంస్థల ఏర్పాటుకు పెట్టుబడులు పెంచాలని 2012లోనే జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిషన్‌ సిఫారసు చేసింది. ఉపాధ్యాయ విద్యను రూపొందించి, పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఏదేమైనా అనేక మంది అధ్యాపకులు సంక్లిష్టమైన పరిస్థితులలో సైతం విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. విధాన నిర్ణేతలు చేయాల్సింది ఏమిటంటే వారి పని పరిస్థితులను మెరుగుపరచడం. సరైన వనరులు, శిక్షణ కల్పించడం, ఎందుకంటే దేశ భవిష్యత్తుకు అధ్యాపకులే కీలకం కనుక.

➡️