- పెట్టుబడి సాయం రూ.20 వేలపై రైతుల్లో చర్చ
- రబీ సాగు ప్రారంభమవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువు
- రెండు జిల్లాల్లో సుమారు 2.50 లక్షల మంది రైతుల ఎదురుచూపు\
- కౌలురైతులకు అందేలా చర్యలుండేనా?
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రభుత్వం అందిస్తామన్న పెట్టుబడి సాయం రూ.20 వేలు ఎప్పుడు ఇస్తారంటూ అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఆర్భాటంగా హామీలు గుప్పించిన కూటమి అధికారంలోకొచ్చి ఆరు నెలలు గడిచినా రైతులకు అందించాల్సిన సాయంపై నోరు విప్పకపోవడం రైతాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఖరీఫ్ పూర్తయ్యిందని, రబీ సాగు ప్రారంభం కావడంతో ఇప్పుడైనా పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వం రైతుభరోసా కింద ఏటా రైతులకు రూ.13,500 చొప్పున అందించింది. దీనిలో కేంద్రం మూడు విడతలుగా రూ.ఆరు వేలు జమ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభంలో మే చివరి వారంలో మొదటి విడతగా రూ.5,500, రెండో విడతగా రబీ సీజన్‌కు అనువుగా జనవరిలో రూ.రెండు వేలు రైతుల ఖాతాల్లో జమ చేసేది. రెండు జిల్లాల్లో దాదాపు 2.50 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం అందుకునేవారు. ఏలూరు జిల్లాలోనే లక్షా 35 వేల మంది వరకూ లబ్ధిదారులైన రైతులు ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామంటూ టిడిపి కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 80 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో రైతు కుటుంబాలు ఎన్నికల్లో కూటమికి జైకొట్టాయి. రెండు జిల్లాల్లోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు టిడిపి కూటమి గెలుచుకుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పెట్టుబడి సాయానికి గత ప్రభుత్వం రైతు భరోసా అని పేరు పెట్టగా, ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపింది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సాయం హామీ మాత్రం కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఖరీఫ్ పూర్తయ్యి, రబీ ప్రారంభమైనా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం మాట్లాడకపోవడం రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంట సాగు సమయంలో పెట్టుబడి సాయం అందించకపోతే ఏ విధంగా మేలు జరుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది అసలు పెట్టుబడి సాయం ఇస్తారా అనే అనుమానాలు సైతం రైతుల్లో నెలకొన్నాయి. ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సాయం సొమ్ము అందించాలని రైతులు కోరుతున్నారు.
కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందేనా..?
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయ సాగులో 70 శాతానికిపైగా కౌలు రైతులే చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం సాగు చేసే రైతులకే అందించాలి. ప్రభుత్వం అందించే సాయం కౌలు రైతులకు అందించాల్సి ఉంది. కౌలుచట్టంలో మార్పులు చేస్తామని ప్రభుత్వం మాటలతోనే కాలక్షేపం చేస్తోంది. ఇ-క్రాప్‌లో భూ యజమానుల పేర్లే ఉన్నాయి. ఇ-క్రాప్ ఆధారంగా పెట్టుబడి సాయం అందిస్తే భూ యజమానులకే వెళ్లిపోతుంది. సాగు చేసే కౌలురైతులకు ఎటువంటి న్యాయమూ జరగదు. ప్రభుత్వం సాగు చేసే కౌలురైతులకే పెట్టుబడి సాయం రూ.20 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యాంకులు అందించే పంట రుణాలు సాగుచేసే కౌలురైతులకు అందని పరిస్థితి నెలకొంది. రైతుమిత్ర గ్రూపుల ద్వారా కొద్ది మొత్తంలో రుణాలు అందించి కౌలురైతులకు ఇచ్చినట్లు లెక్కలు చూపుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సాయం అందించడంతోపాటు, సాగుచేసే కౌలురైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాలి.