- అమలుకు నోచుకోని కూటమి హామీ
- ఉపాధ్యాయులకు పెరుగుతున్న బోధనేతర పనులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తొలగిస్తామంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి నేతలు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోవడం పట్ల కూడా ఎన్నికల ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే విధానాలను కొనసాగించడంతో పాటు మరింత భారం వేసే విధంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరు మారకపోవడం తో పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకు యాప్‌లతో ఉపాధ్యాయులు కుస్తీ పట్టడం కొనసాగుతోంది. మొత్తం 64 రకాల యాప్‌లను ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం పాఠశాలకు రాగానే విద్యార్ధుల, ఉపాధ్యాయుల హాజరు నుంచి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల కిట్లు, హాజరు, చిక్కీలు, కోడిగుడ్లు ఎన్ని వచ్చాయి అనే సమాచారం అప్‌లోడ్ చేయాలి. ఉదాహరణకు మధ్యాహ్న భోజనం విషయం తీసుకుంటే ప్రతిరోజూ ఎంత సరుకు వచ్చింది?. ఎంత వినియోగించారు?. అందుకు ఎంత బిల్లు అవుతుంది?. గుడ్లు ఎన్ని అందాయి అనే అంశాలను రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి తరగతిలో ఎంతమంది పిల్లలు హాజరయ్యారు అనే వివరాలను స్టూడెంట్స్ అటెండన్స్ యాప్‌లో నమోదు చేయాలి. ఇవి కాకుండా ఉపాధ్యాయులు దీక్ష యాప్‌లో పిల్లలకు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, వారికి పరీక్షల్లో వచ్చిన మార్కుల వంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వీటిని అప్‌లోడ్ చేయడం కోసం ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, పెద్ద ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు పనిచేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అమలైన పద్దతే దాదాపుగా ఇప్పుడూ కొనసాగుతోంది.
ఒక్కటి రద్దు చేసి … పది పనులు అప్పగించి…!
గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను బాత్‌రూమ్‌లను ఫోటో తీసి అప్‌లోడ్ చేయాల్సిరావడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాత్‌రూమ్‌లను ఫొటో తీయడాన్ని నిషేధించింది. దాని స్థానంలో గూగుల్ ఫాం పేరుతో 10 రకాల పనులను అదనంగా ప్రవేశపెట్టింది. దీంతో పాఠశాల మొదలైన నుంచి యాప్‌ల నిర్వహణకే సమయం సరిపోతుందే తప్ప బోధనకు సమయం ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌ల గోల తగ్గించాలని ఎనిమిదేళ్ల నుంచి ప్రభుత్వం దృష్టికి పలుమారు ఉపాధ్యాయ సంఘాలు తీసుకొచ్చాయి. ఉన్నవాటిని తొలగించకపోగా ప్రతి ఏటా కొత్త యాప్‌లను విద్యాశాఖ రూపొందిస్తుండటాన్ని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎక్కడ దొరుకుతారా? ఎలాంటి చర్యలు తీసుకుందామనే ఆలోచనతో ప్రభుత్వ తీరు కనపడుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసి సెల్‌ఫోన్ లేని బడిగా ఉంచితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, పరీక్ష మార్కుల అప్‌లోడ్ తప్ప మిగిలిన పనులు అప్పగించకూడదని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి
వివిధ పథకాల అమలుకోసం ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కూడా వారిపై ఒత్తిడి పెంచుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమన్వయం లేకపోవడమే దీనికి కారణం. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఎస్‌సిఇఆర్‌టి మధ్య ఏ మాత్రం సమన్వయం ఉండటం లేదని ఉపధ్యాయులు చెబుతున్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ట్రైనింగ్ పేర్లతో ఉపాధ్యాయులు, లీడర్ షిప్ ట్రైనింగ్ పేరుతో ప్రధానోపాధ్యాయులకు నిర్బంధ శిక్షణ ఇచ్చారు. దీనివల్ల ఉపాధ్యాయులు చాలా మంది ఇబ్బందిపడ్డారు. లీడర్‌షిప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో నవంబర్‌లో నిర్వహించిన రెసిడెన్షియల్ శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయుడు రత్నాకర్ మరణించారు. ప్రతి మూడో శనివారం కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని పాఠశాల విద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం పూట విద్యార్థులను ఇళ్లకు పంపించి మరీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది.