గోదావరి వాసుల.. తాగునీటి ఘోష..!

కొత్త ప్రభుత్వమైనా సమస్యను పరిష్కరించేనా?
ఆక్వా చెరువులతో తాగునీటి వనరులు ధ్వంసం
కొనుగోలు చేస్తే తప్ప తీరని దాహం
వాటర్‌గ్రిడ్‌ అంటూ గత ప్రభుత్వం ఐదేళ్లు కాలక్షేపం
గంపగుత్తగా ఓట్లేసిన గోదావరి ప్రజల గోడు వినేనా
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పరవళ్లు తొక్కే గోదావరిని ఆనుకుని ఉన్నా దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న జిల్లా ప్రజల ఘోష కొత్త ప్రభుత్వానికైనా విన్పించేనా అనే చర్చ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో టిడిపి కూటమి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 స్థానాలనూ గెలుచుకుంది. దీంతో జిల్లాలోని ప్రధానమైన తాగునీటి సమస్యను కొత్త ప్రభుత్వమైనా పరిష్కరించాలని అంతా కోరుతున్నారు. విచ్చలవిడిగా ఆక్వా చెరువుల తవ్వకాలు సాగించడంతో రెండు జిల్లాల్లోని తాగునీటి వనరులన్నీ కలుషితమయ్యాయి. ఆక్వా చెరువుల్లో నీటిని పంట కాలువల్లోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. అదేనీటిని పంచాయతీ తాగునీటి ట్యాంకుల్లోకి నింపుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 40 లక్షల జనాభా ఉంది. ముఖ్యంగా డెల్టా పరిధిలోని 29 మండలాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డబ్బు పెట్టి కొనుగోలు చేస్తే తప్ప దాహం తీరని పరిస్థితి నెలకొంది. నెలకు కనీసంగా లెక్కించినా రూ.600కుపైగా తాగునీటి కోసం ఖర్చు చేయాల్సి వసోంది. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలోని తాగునీటి సమస్యనే ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సాగింది. అయితే సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఏ గ్రామం వెళ్లి పరిశీలించినా పంచాయతీ ట్యాంకుల నుంచి విడుదల చేస్తున్న నీరు తాగడానికి పనికిరాని పరిస్థితి. పసర్లు కమ్మి అధ్వానంగా ఉంటున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే వాటర్‌గ్రిడ్‌ ద్వారా గోదావరి నుంచి పైపులైన్‌ వేసి ప్రతి గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తామని వైసిపి ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో హడావుడి చేసింది. వాటర్‌గ్రిడ్‌కు రూ.3,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని డెల్టాకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించి రూ.1400 కోట్లకు బడ్జెట్‌ను కుదించింది. అయినప్పటికీ ఐదేళ్ల పదవీకాలంలో వాటర్‌గ్రిడ్‌ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో జిల్లాలోని తాగునీటి సమస్య ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎన్నికల ముందు ప్రతి పార్టీ తాగునీటిపై హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. జిల్లాప్రజానీకం ఎదుర్కొంటున్న ప్రధానమైన తాగునీటి సమస్యను కూడా పాలకులు పట్టించుకోకపోవడం ఇక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. వైసిపి ఓటమిలో ఈ అంశం కూడా ప్రధానమైందని చెప్పొచ్చు.కలుషిత నీటితో అనారోగ్యం పాలు జిల్లాలో అత్యధికంగా దిగువ మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారు. ఏరోజు పనికి వెళ్తే ఆ రోజే కడుపు నిండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ రూ.30 వెచ్చించి తాగునీరు కొనుగోలు చేయలేక కలుషిత నీటినే తాగుతున్నారు. దీంతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో కిడ్నీ సమస్యలు, కేన్సర్‌ వంటి రోగాలు ఎక్కువగా రావడానికి కలుషిత తాగునీరే కారణమనే చర్చ నడుస్తోంది. ఇంకా అనేక రోగాలు జిల్లా ప్రజలను చుట్టుముడుతున్న పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వమైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

➡️