- అదాని డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
ప్రజాశక్తి – విశాఖపట్నం : ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా…’ అన్నట్లు విశాఖలో ఏర్పాటు చేయతలపెట్టిన అదాని డేటా సెంటర్‌కు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి మరీ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు స్టేట్ ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఇఐఎఎ) కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ఇక వేగంగా ప్రారంభమౌతాయని భావిస్తున్నారు. మధురవాడకు సమీపంలోని కొండమీద అదాని డేటాసెంటర్‌తో పాటు సమగ్ర ఐటిపార్కు, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీకి 200 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే కంబాలకొండ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఉండటంతో పర్యావరణానికి, జీవవైవిధ్యానికి హాని కలుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, గత జనవరిలోనే ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అటవీశాఖ ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. ‘ప్రతిపాదిత ప్రాజెక్టు కంబాలకొండ వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి, ఎకో సెన్సిటివ్ జోన్‌కు హద్దులు అవతలే ఉంది. దీనివల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఎటువంటి హాని లేదు.’ అంటూ అటవీశాఖ అధికారులు నివేదించినట్లు తెలిసింది. ఈ నివేదిక అధారంగా ఎస్‌ఇఐఎఎ తాజాగా గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
నిబంధనల ఉల్లంఘన ఇలా..
2017 నాటి పర్యావరణ ఉత్తర్వులు రక్షత ప్రాంతానికి, దాని ఎకో సెన్సిటివ్‌జోన్‌కు ఒక కిలోమీటర్ వరకు వాణిజ్య సంస్థల నూతన నిర్మాణాలను పూర్తిగా నిషేధించింది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకుగానూ రక్షితప్రాంతం, ఎకో సెన్సిటివ్‌జోన్‌లలో ఏది దగ్గరైతే దానిని పరిగణలోకి తీసుకుని కిలోమీటరు దూరాన్ని లెక్కించాలని పేర్కొంది ఈ కీలకమైన నిబంధనను పర్యావరణ శాఖ విస్మరించింది.కంబాలకొండ వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి అదాని తలపెట్టిన డేటా సెంటర్ కిలోమీటర్ లోపే ఉండటం గమనార్హం. సంరక్షణ కేంద్రం నుండి 970 మీటర్ల దూరంలోనే ఈ కేంద్రాన్ని అదాని గ్రూపు ప్రతిపాదించింది. అంటే పర్యావరణం, జీవ వైవిధ్యం పరంగా సున్నితమైన ప్రాంతంలోకి 30 మీటర్ల దూరం అదాని డేటా సెంటర్ చొచ్చుకువస్తోంది. సామాన్యులకైతే పర్యావరణ చట్టాలను, నిబంధనలు నూరుశాతం అమలు చేస్తారు. అదానికి సంబంధించిన ప్రాజెక్టు కావడంతో ఆ 30 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ నిర్వహించాలని పేర్కొంటూ పర్యావరణ శాఖ గ్రీన్ సిగల్ ఇచ్చింది.
రోజుకు 26.44 లక్షల లీటర్ల నీటి వినియోగం
ప్రతిపాదిత డేటా సెంటర్ రోజుకు 26,44,000 లీటర్ల నీటిని వినియోగించనుంది. దీనిలో 14.69 లక్షల లీటర్ల నీటిని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ నీటిని రీ సైకిల్ చేయడం ద్వారా మిగిలిన నీటిని డేటా సెంటర్ వినియోగించుకుంటుందని చెబుతున్నారు. 1600 కిలోలీటర్ల సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంటును అదాని సంస్థ ఇక్కడ ప్రతిపాదించింది. వృధ్దా నీటిని రీసైకిల్ చేసి గృహావసరాలకు, గ్రీన్‌బెల్ట్‌కు వాడతామని ఆ సంస్థ తెలిపింది.