పేరుకే మూడెంచల విధానం

Feb 19,2025 06:16 #primary, #schools, #There are two types
  • ప్రైమరీలో రెండు రకాల స్కూళ్లే
  • ‘బేసిక్‌’ ఉండకూడదని అధికారుల ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూతవేసే విషయంలో ఏ ప్రభుత్వమూ తగ్గడం లేదు. టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ బడుల గొంతు నొక్కడంలో ఒకేలా వ్యవహరిస్తున్నాయని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అంటున్నారు. వైసిపి హయాంలో పాఠశాలలు మూతపడుతున్నాయని గగ్గోలు పెట్టిన టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్న స్కూళ్లను మూతవేయాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సాల్ట్‌ పేరుతో పరోక్షంగా మూతవేసే విధానాలను అవలంబిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జివో వల్ల వేల పాఠశాలలు మూతబడ్డాయి. ఈ జివోకు ప్రత్యామ్నాయం పేరుతో టిడిపి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో మూడు రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రైమరీ, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ పేరుతో మూడు రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్‌ పాఠశాలలో పిపి1, పిపి2తో పాటు 1,2 తరగతులు ఉంటాయి. బేసిక్‌ ప్రైమరీ, మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో పిపి1, పిపి2లతో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. పంచాయతీకి ఒక మోడల్‌ స్కూల్‌ కాన్సెప్ట్‌ పేరుతో విద్యార్ధుల సంఖ్య 60 ఉన్న వాటిని మోడల్‌గా మారుస్తామని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. వీటితో పాటు బేసిక్‌ స్కూళ్లు కూడా ఉంటాయని తెలిపింది. ఉత్తర్వుల్లో మూడు అంచెలు పెట్టిన అధికారులు ఆచరణలో మాత్రం రెండే ఉండాలని ప్రధానోపాధ్యాయులపై మౌఖిక ఆదేశాలతో ఒత్తిడి తేస్తున్నారు. పంచాయతీలో ఫౌండేషన్‌, మోడల్‌ ప్రైమరీ పాఠశాలలే ఉండాలని ఆదేశిస్తున్నారు. మోడల్‌ స్కూల్‌ దూరంగా ఉండే విద్యార్ధులు బేసిక్‌ స్కూల్‌కు వెళ్తారని, దానిని కూడా కొనసాగించాలని కోరుతున్న ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉన్నతాధికారులే మాట్లాడుతున్నట్లు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3,4,5 తరగతులకు బడి దూరమయితే తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలకు పంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. ప్రతి నెల మూడో శనివారం కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఈ సమావేశాల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. పాఠశాలలను మూసివేయడానికి లేదా విలీనం చేయడానికి స్థానిక ప్రజలను ఒప్పించే బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనని అధికారులు చెప్పడంతో దానిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని సమాచారం.

➡️