నెల్లూరు ఉద్యమ సారథులకు నెలవు..

  • పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య స్ఫూర్తి
  • రాష్ట్ర కార్యదర్శులుగా సేవలందించిన బివి రాఘవులు, పి మధు, వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు ఉద్యమాలకు పుట్టినిల్లు.. ఇక్కడ నుంచే పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీకి, సిపిఎంకు సారధ్యం వహించారు. పదమూడు సంవత్సరాల చిరుప్రాయంలోనే స్వాతంత్రోద్యమ భావాలతో ముందుకు నడిచారు. విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడారు. అంచలంచెలుగా దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి నిర్మాతగా మారారు. సిపిఎం తొలి జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఆయన, ఆయన కుటుంబం మొత్తం పేదలకు, కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి త్యాగాలు చేశారు. తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, సమీప బంధువు డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి, జక్కా వెంకయ్యలను కమ్యూనిస్టు ఉద్యమం వైపు తీసుకొచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు కష్టజీవుల ఆప్తమిత్రుడిగా సేవ చేశారు. మూడుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. జక్కా వెంకయ్య కమ్యూనిస్టు పార్టీకి, సిపిఎంకు అంకితభావంతో పని చేశారు. నెల్లూరు జిల్లాలో సిపిఎం ఉద్యమ నిర్మాతగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ప్రజా వైద్యం ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి తాము ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఇప్పటికీ ఈ పేర్లు చెబితే నెల్లూరు నేల పులకిస్తుంది. కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులకు నరనరాన చైతన్యం వెల్లువిరుస్తోంది. అలాంటి సింహపురిలో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహిస్తున్నారు.

నెల్లూరు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు రాష్ట్ర సిపిఎంకు నాయకత్వం వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి ఉద్యమ నాయకులుగా నెల్లూరులో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. పి.మధుది నెల్లూరు పక్కనే ఉన్న కనుపర్తిపాడు గ్రామం. 14 సంవత్సరాల వయస్సులోనే గ్రామంలోని భూస్వాముల పెత్తనంపై తిరగబడ్డారు. గ్రామంలో సిపిఎం అభివృద్ధికి అప్పుడే బీజాలు పడ్డాయి. నెల్లూరు నగరంలోని విఆర్‌ కళాశాలలో చదువుకున్నారు. కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐకి నాయకత్వం వహించారు. 1969లో తొలి విద్యార్థి సంఘం కార్యదర్శిగా, డివైఎఫ్‌ఐ, రైతు సంఘం తొలి రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. 2014 మార్చి 8న రాష్ట్ర విభజన అనంతరం ఎపికి తొలి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. 2021 వరకు కొనసాగారు.
బివి రాఘవులు ప్రకాశం జిల్లా పెదమోపాడు గ్రామంలో జన్మించారు. కందుకూరులో పాఠశాల విద్యను పూర్తి చేశారు. గుంటూరు, బాపట్లలో చదువుకున్నారు. కావలిలోని జవహర్‌ భారతీ డిగ్రీ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు, అనేక ప్రజా సంఘాల్లో పని చేశారు. 1997లో నల్గొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 వరకు పనిచేశారు. ప్రస్తుతం సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు. బలమైన నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారు. విద్యుత్‌ పోరాటం, ఇంటి స్థలాల పోరాటంతోపాటు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

వి.శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం తెల్లంపల్లిలో జన్మించారు. కావలి జవహర్‌ భారతిలో డిగ్రీ చదువుకున్నారు. నెల్లూరు నగరంలోని విఆర్‌ లా కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐలో కీలక నేతగా పని చేశారు. జక్కా వెంకయ్య, వి.శ్రీహరి ప్రోత్సాహంతో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నెల్లూరు యువజన ఉద్యమంలోనూ, రైతు సంఘం, పార్టీ బాధ్యతల్లో పని చేశారు. ‘ప్రజాశక్తి’లో సంపాదకులుగానూ సేవలందించారు. 2021లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై కొనసాగుతున్నారు. నెల్లూరు కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి ఎందరో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగారు. 47 సంవత్సరాల తరువాత నెల్లూరులో జరుగుతోన్న సిపిఎం మహాసభ మరింత కాలం గుర్తుండి పోయేలా సాగనుంది.

➡️