‘పాత’ భారం భరించేదెలా!

Apr 13,2025 13:47 #debts

బిల్లుల బకాయిల మొత్తం రూ.లక్ష కోట్లకుపైనే
కొత్త ఏడాదికి బదలాయింపుపై ఆందోళన
ఆర్థికశాఖ మార్గదర్శకాలతో అయోమయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ఖజానాపై పాత బిల్లుల భారం ఆందోళన కలిగిస్తోంది. కొత్త బడ్జెట్‌లో పాత బకాయిలకు కేటాయింపులు లేకుండా చెల్లిరపులు చేయాలరటే ఎలా అని శాఖాధిపతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అన్ని శాఖలకు ఆర్థికశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు చూస్తే ఖజానాను ముందుకు తీసుకువెళ్లడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శాఖల్లో ఇదే అరశంపై చర్చ జరుగుతోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చులపై ఇటీవల ఆర్థికశాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనేక బిల్లుల చెల్లింపులను నిలిపివేసి వాటిని కొత్త సంవత్సరానికి బదలాయించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోది. వీటిని పరిష్కరించెందుకు ప్రయత్నించినప్పటికీ ఆర్థికంగా అవకాశాలు లేకపోవడంతో వాటిని ఈ ఏడాదికి బదలాయించాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌లో పాత బకాయిల ఊసు లేకపోవడంతో వాటి చెల్లింపులు ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఏడాది చేయాల్సిన ఖర్చులకు సంబంధించే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేశారు. వాస్తవానికి ప్రతియేటా ఆమోదిస్తున్న బడ్జెట్‌లోనే అవసరాలకు సరిపడే వ్యయాన్ని చేయలేకపోతున్నారు. ఆదాయం చాలకపోవడం వల్లనే అంటూ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పాత బిల్లులను కొత్త సంవత్సరంలోకి బదలాయించడం వల్ల వాటికి నిధులు ఎక్కడనుంచి వస్తాయన్నది అధికారుల అనుమానం. వాటిని ఈ ఏడాది నిధులు సమకూరిస్తే ఈ ఏడాది వచ్చే కొత్త బిల్లులకు నిధుల కొరత మళ్లీ ప్రారంభమవుతుందని వారంటున్నారు. ఇప్పటికే పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువవుతోంది.

➡️