- బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ వేగవంతం
- సుప్రీం కోర్టులోనూ కేసులు
- ఇప్పటికీ న్యాయవాదులను నియమించని ఎపి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృష్ణా జలాల పంపక వివాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఆందోళన కలిగిస్తోంది. మిగులు జలాల వాడకం విషయంలో ఉన్న హక్కుపై ప్రభుత్వం గట్టివాదనలు వినిపించిం దన్న సంతృప్తి కలిగించలేకపోతోంది. మరోవైపు ఎపి చేపట్టే ప్రతి ప్రాజెక్టుపైనా ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం కెఆర్‌ఎంబిలోనూ, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందూ ఫిర్యాదులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎపి ప్రభుత్వం దానికి అనుగుణంగా లాయర్లను నియ మించడంలోనూ, గట్టివాదనలు వినిపించడంలోనూ శ్రద్ధ చూపిం చడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
ఈ ఏడాది జులైతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పదవీకాలం ముగుస్తుంది. రెండు రాష్ట్రాల వాదనలు విని పంపకాలు ఖరారు చేయాల్సి ఉండటంతో ట్రిబ్యునల్ విచారణ వేగవంతం చేసింది. మరోవైపు ట్రిబ్యునల్‌లో, సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు ప్రముఖ న్యాయవాదులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ 2024 నవంబర్లో జిఓ ఇచ్చింది. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం నీటిపారుదల అధికారిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను ఇరిగేషన్ సలహాదారుగా నియమించింది. దీంతో ఆయన ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరపున గట్టి వాదనలు వినిపిస్తున్నారు. కొత్తగా ముందుకు తెచ్చిన బకనచర్ల లింకుపైనా ఇటీవల ఫిర్యాదు చేశారు.
ఎపి పరిశీలన ఎలా
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ వినిపిస్తున్న వాదనలను గట్టిగా తిప్పికొడుతూ ఎపి తరపున వాదించేందుకు న్యాయవాదులు హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు జలాల విషయాలపై సంప్రదింపులు జరపాలి. తెలంగాణ వాదన ఏమిటి ? ఎపి తరపున ఏమి చెప్పాలనే అంశంపై నిరంతరం ప్రభుత్వం అభిప్రాయంపై అధికారులు న్యాయవాదులతో మాట్లాడాలి. జలాల వినియోగంలో ఎపికి ఉన్న హక్కులు, అధికారాలు వంటి అంశాలపై న్యాయవాదులకు వివరణ చెప్పాలి. ఇప్పటి వరకు అటువంటిది జరిగిన దాఖలా లేదు. ట్రిబ్యునల్‌లో వాదనలు సరిగ్గా వినిపించకపోతే మిగులు జలాల వినియోగ హక్కులు కోల్పోతామని, పైగా 2050 వరకూ కృష్ణా జలాలను నష్టపోయే ప్రమాదం ఉందని, తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయనీ చెబుతున్నారు.
వాదనలు వినిపిస్తాం : ఎపి అధికారులు
న్యాయవాదులను నియమించలేదన్న అంశంపై ఇరిగేషన్ అధికారులను ఫోన్లో వివరణ కోరగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తోందని, ఎపి ప్రభుత్వం చెప్పాల్సి వచ్చినప్పుడు న్యాయవాదులను నియమిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసే వాదనలు వినకుండా న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు ఎటువంటి వాదనలు చేస్తారని ప్రశ్నించగా అది ప్రభుత్వ నిర్ణయమని వివరించారు.
న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలి : టి లక్ష్మీనారాయణ
కృష్ణా జలాల అంశంలో కెఆర్‌ఎంబి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించేం దుకు వెంటనే న్యాయవాదులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నీటిపారుదల రంగ నిపుణులు తుంగా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కమిటీలు వేసి చర్చలు జరిపేవని, ఇప్పుడు కనీసం న్యాయ వాదులను కూడా నియమించడం లేదని విమర్శిం చారు. ఇదే పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.