- బెంబేలెత్తిస్తున్న కూర’గాయాలు’
- టమాటా, ఉల్లి, ఆలూ ధరలపై ఆర్‌బిఐ, క్రిసిల్ ప్రత్యేక అధ్యయనం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు, నిత్యావసర వస్తువుల ధరల అదుపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు భిన్నమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. ‘ధరల పెరుగుదల వాస్తవమే’నని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఒక నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరింత విస్తృతంగా అధ్యయనం చేసి, ఒక నివేదిక విడుదల చేసింది. రిజర్వుబ్యాంకుకు చెందిన ఎకానమిక్ అండ్ పాలసీ రీసెర్చి విభాగం టమాటో, ఉల్లి (ఆనియన్), ఆలు (పొటాటో) ధరలపైనే కేంద్రీకరించి ఈ అధ్యయనం చేయడం విశేషం. ఆంగ్ల భాషలో ఈ మూడింటి మొదటి అక్షరాలను కలిపి (టిఓపి-టాప్)గా ఆర్‌బిఐ పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా ‘టాప్’ ధరలు చుక్కలు దాటి ఎలా పరుగులు తీస్తున్నాయో ఈ నివేదికలో వివరించారు. గత ఏడాది ఆగస్టు నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు వీటి ధరల్లో సగటున 30 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ‘క్రిసిల్ ఎంఐ అండ్ ఎ’ సెప్టెంబర్ నెలాఖరు వరకు చేసిన మరో అధ్యయనంలో ఏడాది కాలంలో టమాటా 18శాతం, ఉల్లి 50శాతం, ఆలూ 53 శాతం ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఈ రెండు నివేదికలు కూడా వీటి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేదనే సంకేతాలు ఇస్తుండటం సామాన్యుడికి శరాఘాతమే!
ఆర్‌బిఐ అధ్యయనంలో …
ఆర్‌బిఐ అధ్యయన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో టమాటా, ఉల్లి, ఆలూ ధరలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా కూరగాయల ధరలు పెరిగితే ఆహార ద్రవ్యోల్భణం పెరుగుతుందని, కూరగాయల ధరల్లోనూ ఈ మూడింటి ప్రభావమే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. గత ఏడాది జులై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్‌లలో ఆహార ద్రవ్యోల్భణం అత్యధికంగా నమోదు కాగా, ఆ అన్ని నెలల్లో కూరగాయల ద్రవ్యోల్భణం అధికంగా నమోదైంది. అదేవిధంగా కూరగాయల ధరలు దేశ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నెలల్లో టమాటో, ఉల్లి, ఆలూ ధరలు గణనీయంగా తగ్గాయని, వీటి ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూరగాయల ద్రవ్యోల్భణం కూడా తక్కువగానే ఉందని పేర్కొంది. ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ – డిసెంబర్ మధ్యకాలంలో అత్యధికంగా పెరుగుతున్నాయని, ఆలూ ధరలు అక్టోబర్-నవంబర్ నెలల్లో గరిష్ట స్థాయికి చేరుతున్నాయని పేర్కొన్నారు. టమాటా ధరలు ఒక సంవత్సరం పెరిగితే, మరో సంవత్సరం తగ్గుతున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు టమాటా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.
క్రిసిల్ నివేదికలో …
క్రిసిల్ నివేదిక ప్రకారం శాఖాహార భోజనం ఖరీదు ఏడాదికేడాదికి గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇళ్లలో చేసుకునే శాఖాహార భోజనం ఖర్చు 11 శాతం పెరిగిందని, అదే హోటళ్లు, రెస్టారెంట్లలో 31.3 నుండి 37 శాతం దాకా ఈ పెరుగుదల ఉందని పేర్కొంది. టమాటా, ఉల్లి, ఆలూ ధరలు భారీగా పెరగడమే ఈ పరిస్థితికి కారణమని వివరించింది. ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాల కారణంగా మార్కెట్లోకి డిమాండ్ మేరకు ఇవి రాలేదని, ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ఇదే కారణమని పేర్కొంది. శాఖాహార భోజనంలో 9శాతంగా ఉండే పప్పుల ధరలు కూడా ఈ ఏడాది కాలంలో 14శాతానికి పెరిగాయని తెలిపింది.