‘కొల్లేరు’పై కల్లబొల్లి మాటలు !

Apr 2,2024 06:40 #Kolleru
  • ప్రజలను మోసగిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : కొల్లేరు ప్రజలను మరోసారి మోసగించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఓట్ల కోసం నిస్సిగ్గుగా మాయమాటలు చెబుతున్నాయి. కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని, అక్కడి ప్రజలను ఆదుకుంటామని చెప్పి మళ్లీ హామీలు గుప్పిస్తున్నాయి. కొల్లేరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపకుండా వంచించడంలో ప్రధాన ముద్దాయి బిజెపినే. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి కాంటూరు కుదింపు ఏమంత కష్టం కాదు. మాతోనే కొల్లేరు సమస్య పరిష్కారమంటూ కైకలూరు బిజెపి అభ్యర్థి మళ్లీ చెప్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొల్లేరు ప్రాంతం 77 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. కొల్లేరులో బెడ్‌, బెల్ట్‌ గ్రామాలు 120కుపైగా ఉన్నాయి. ఈ గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నారు. కొల్లేరులో సంప్రదాయ పద్ధతిలో రైతులు వరి సాగు చేసేవారు. జలగం వెంగళరావు ప్రభుత్వ హయాంలో కొల్లేరు గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేసి భూములను పంపిణీ చేశారు. భూములు చేపల చెరువులకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రభుత్వమే బలవంతంగా చేపల చెరువులు తవ్వించింది. అయితే, 2005లో ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కొల్లేరులోని చేపల చెరువులన్నింటినీ బాంబులు పెట్టి ధ్వంసం చేశారు. కొల్లేరు భూములనే కాకుండా దాదాపు పది వేల ఎకరాల్లోని పట్టా భూముల్లోని చెరువులను ధ్వంసం చేయడంతో అప్పటి నుంచి కొల్లేరు ప్రజల బతుకులు దుర్భరంగా మారాయి. ఉపాధి లేక కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి బతుకులు నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపి, బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, కైకలూరు ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ను ప్రజలు గెలిపించారు. సర్వేల పేరుతో హడావుడి చేయడం తప్ప, కొల్లేరు ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోలేదు. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రంలోని టిడిపి, బిజెపి ప్రభుత్వం అప్పట్లో చేతులు దులుపుకుంది. ధ్వంసం చేసిన పట్టా భూములను రైతులకు అప్పగించలేదు. అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా బాధిత ప్రజలకు నేటికీ న్యాయం జరగలేదు.

ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో వైసిపి వెన్నుపోటు !
2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామంటూ వైసిపి హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చాక మూడో కాంటూరు కుదింపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయింది. కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీనీ గాలికొదిలేసింది. మూడో కాంటూరుకు కుదింపును పక్కనపెట్టి ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కొల్లేరు ప్రజలకు వెన్నుపోటు పొడించేందుకు సిద్ధమైంది. కొల్లేరును పదో కాంటూరు వరకూ విస్తరించేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహించడంతోపాటు మండల కేంద్రాల్లో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. దాదాపు మరో 80కుపైగా గ్రామాలను ఎకోసెన్సిటివ్‌ జోన్‌లోకి చేర్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోలేదు.

మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత మాటలు
ప్రస్తుత ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కైకలూరులో బిజెపి పోటీ చేస్తోంది. 2014లో గెలుపొందిన కామినేని శ్రీనివాస్‌కే మరోసారి టికెట్‌ దక్కింది. అప్పుడు ఐదేళ్లపాటు కొల్లేరు ప్రజలను మోసగించిన బిజెపి అభ్యర్థి… కొల్లేరు సమస్య మాతోనే పరిష్కారమంటూ ఇప్పుడు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వైసిపి, టిడిపి కూడా కొల్లేరు ప్రజలను మరోసారి మాటమాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఈ పార్టీల తీరును నిశితంగా గమనిస్తున్న కొల్లేరు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు.

➡️