చదివేందుకు పుస్తకాలేవి?

Apr 11,2025 05:41 #text books
  • కొత్త పాఠ్య పుస్తకాల విడుదలలో ఎన్‌సిఇఆర్‌టి విఫలం
  • గత వారమే ప్రారంభమైన పాఠశాలలు
  • ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

న్యూఢిల్లీ : విద్యా పరిశోధన, శిక్షణ జాతీయ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) తాను నిర్దేశించుకున్న కాలక్రమాన్ని తానే ఉల్లంఘిస్తోంది. నాలుగు తరగతుల విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన పాఠ్యపుస్తకాలకు అతీగతీ లేకపోవడంతో పాఠశాలలు గందరగోళంలో పడుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుండి 4, 5, 7, 8 తరగతుల విద్యార్థుల కోసం నూతన పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామని ఎన్‌సిఇఆర్‌టి గతంలోనే ప్రకటించింది. సంవత్సరం క్రితమే పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సకాలంలో ఆ పనిని పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కూడా 3, 6 తరగతుల విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు ప్రచురించడంలో జాప్యం జరిగింది. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఆగస్టులో 6వ తరగతి గణితం, సాంఘిక శాస్త్ర పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కూడా గత వారమే అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఎన్‌సిఇఆర్‌టి ఇప్పటి వరకూ నాలుగో తరగతి విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీషు పుస్తకాలను, ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు పుస్తకాన్ని మాత్రమే విడుదల చేసింది. ఏడో తరగతి హిందీ పాఠ్య పుస్తకం ఇంకా రాలేదు. కొత్త పుస్తకాలను ఎన్‌సిఇఆర్‌టి వెబ్‌సైటులో ఇంకా అప్‌లోడ్‌ చేయలేదు. 4, 5, 7, 8 తరగతుల విద్యార్థులకు మరే కొత్త పాఠ్య పుస్తకం అందుబాటులో లేదు. 5, 8 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకూ ఎన్‌సిఇఆర్‌టి బ్రిడ్జి కోర్సులు రూపొందించి వాటిని తన వెబ్‌సైటులో అప్‌లోడ్‌ చేసింది. ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను, పాఠ్య పుస్తకాలను ఎలాంటి మార్పులు లేకుండా సిబిఎస్‌ఇ అనుసరిస్తోంది. పాఠ్య పుస్తకాల లభ్యతకు ఎన్‌సిఇఆర్‌టి కాలక్రమాన్ని నిర్దేశించిందని గత నెల 26న జారీ చేసిన సర్క్యులర్‌లో సిబిఎస్‌ఇ తెలియజేసింది. ఆ సర్క్యులర్‌ ప్రకారం… లాంగ్వేజెస్‌ మినహా నాలుగో తరగతికి చెందిన అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఈ నెల 10వ తేదీకి అందుబాటులో ఉండాలి. ఏడో తరగతి సైన్స్‌ పుస్తకాలు 10న, లెక్కల పుస్తకాలు 20న రావాల్సి ఉంటుంది. పదో తేదీ వచ్చినా అవి ఇంకా అందుబాటులో లేవు. ఇక ఐదో తరగతి పుస్తకాలు జూన్‌ 15కు, ఎనిమిదో తరగతి పుస్తకాలు జూన్‌ 20 నాటికి విద్యార్థుల చేతిలో ఉండాలి. ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థులు పాత పాఠ్య ప్రణాళిక నుండి కొత్త దానికి సులభంగా మారేందుకు వీలుగా ఎన్‌సిఇఆర్‌టి బ్రిడ్జి కోర్సులను రూపొందించింది.

పాత పుస్తకాలతోనే బోధన : విద్యార్థి తండ్రి

ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల పాత పాఠ్య పుస్తకాలతోనే విద్యా బోధన కొనసాగిస్తోందని అందులో చదువుతున్న విద్యార్థి తండ్రి తెలిపారు. ‘మా అబ్బాయి చదువుకునే స్కూలులో పాత సిలబసే చెబుతున్నారు. సిలబస్‌ మారితే విద్యార్థులకు కష్టమవుతుంది. సమయం తక్కువగా ఉండడంతో కొత్త సిలబస్‌ను వారు ఎలా పూర్తి చేయగలుగుతారు?’ అని ఆయన ప్రశ్నించారు.

➡️