ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణంలో భూములిచ్చిన రైతులతో ఏర్పాటు చేయాల్సిన సంప్రదింపుల (గ్రామస్థాయి, పూలింగు పథకంస్థాయి) కమిటీలను ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. గ్రామస్థాయిలో వచ్చే సమస్యలు, రాజధాని స్థాయిలో వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కమిటీలు వేయాలని సిఆర్‌డిఏ చట్టంలో పేర్కొన్నారు. అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఈ కమిటీల జోలికి పోలేదు. దీంతో గ్రామస్థాయిలో సమస్యలను సిఆర్‌డిఏ కార్యాలయాని కి వచ్చి చెప్పుకునేవారు. అయితే ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతులను మర్యాదగా చూడాలని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే గ్రామస్థాయిలోనే ఒక నివేదిక తయారు చేసి రాజధాని వ్యాప్తంగా రైతులతో ఏర్పాటు చేసే ఒక కమిటీకి సమర్పించేలా జిఓ తీసుకొచ్చారు. 2015 ఏప్రిల్ 17వ తేదీన 240 నెంబరుతో ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. అప్పటి పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిథర్ ఆర్మానే ఈ జిఓను విడుదల చేశారు. ల్యాండ్ పూలింగుకు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందున పథకం అమల్లో అన్నిస్థాయిల్లోనూ వారి సలహాలు, సూచనలు అవసరమని జిఓలో పేర్కొన్నారు. పూలింగు స్కీము నిబంధనల్లోనూ ఈ విషయం ఉన్నందున వెంటనే గ్రామస్థాయిలో సంప్రదింపుల కమిటీ వేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కమిటీలు వేసే సమయంలో సభ్యులు ఎవరుండాలనేది జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తీసుకోవాలనీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2015లో జిఓ అయితే ఇచ్చారుగానీ 2019 వరకూ అంటే తొలి ఐదేళ్లలో కమిటీలు వేయలేదు. అనంతరం వైసిపి ప్రభుత్వం ఏర్పాటైంది. 2024లో మరలా టిడిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 100 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ గ్రామస్థాయి, రాజధాని స్థాయి కమిటీలు ఏర్పాటుపై అటు మంత్రిగానీ, ఇటు గుంటూరు జిల్లా అధికారులుగానీ స్పందించడం లేదు. రాజధాని పరిధిలో ఏర్పాటు చేసే కమిటీలకు చట్టపరమైన హక్కులూ కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇటీవల రాజధాని పరిధిలో జరిగిన ఒకటీ రెండు అంశాల విషయంలో ఈ కమిటీల ఏర్పాటు వ్యవహారం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే కొండవీటివాగును సరిచేయాలని రైతులు కమిషనర్‌కు సూచించారు. దీన్ని కమిషనర్ కాటంనేని భాస్కర్ పెడచెవిన పెట్టారు. కనీసం తిరుగు సమాధానం కూడా ఇవ్వలేదు. ఈలోపు భారీ వర్షాలు రావడంతో ముంపు వచ్చి చేరింది. వెంకటపాలెం పరిధిలో ఇప్పటికీ ముంపు నీరు నిలిచిపోయి ఉంది. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటు న్న ఇతర సమస్యలపై కూడా కమిషనర్ ఇదే వైఖరి అవలంభించారని సమాచారం. ముఖ్యంగా రైతులు ఏడాది కౌలు విషయంలో సిఆర్‌డిఏ నుండి ఇబ్బందులు పడ్డారు. ఒకే గ్రామంలో కొంతమంది రైతులకు డబ్బులు జమైనా మరికొంత మందికి జమకాలేదు. దీనిపై కమిషనర్‌కు చెప్పుకునేందుకు వెళ్లినా అందుబాటులో లేరని సమాచారం. దీనిపై రైతులు ఇటీవల మంత్రి నారాయణ దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని మంత్రి కమిషనర్‌కు చెప్పినా ఆయన స్పందించలేదు. ఏడాది కౌలు డబ్బులు ఎందుకుపడలేదో సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇదే అంశంపై మంత్రి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రైతులు కూడా తాము భూములు ఇచ్చి అధికారుల చుట్టూ తిరగడం అక్కడకు వెళితే కమిషనర్ గంటల తరబడి కూర్చోబెట్టడం నామోషీగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టపరంగా వాటిని ఏర్పాటు చేస్తే కమిటీల ఆధ్వర్యాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని పరిష్కారానికి మార్గం సులువవుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిఉంది.