‘కియా’లో దొంగలెవరో .?

Apr 11,2025 03:32 #900 car, #disappear, #engines, #Kia, #thief
  • 900 కారు ఇంజన్లు మాయం
  •  ఇండెంట్‌లోనే మతలబు ఉందా..?
  •  దొంగతనంపై యాజమాన్యం మౌనం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కియా కార్ల పరిశ్రమలో కారు ఇంజన్ల దొంగతనం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా 900 ఇంజన్లు దొంగతనం జరిగినా యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా వెలువడకపోవడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఇంత పెద్ద దొంగతనం ఏ రకంగా జరిగి ఉంటుందన్నది ఇప్పుడు సర్వత్రా నడుస్తున్న చర్చ. దొంగతనం జరిగిన వస్తువులు చిన్న విడి భాగానివి కావు.. ఏకంగా కార్లకు అమర్చే ఇంజన్లు. ఇంతటి ప్రాముఖ్యత, విలువతో కూడిన వస్తువులను దొంగలించడం ఎలా సాధ్యమై ఉంటుందన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. దీనిపై అన్ని విధాలుగా విచారణ చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇంజన్లు దొంగతనం జరగాలంటే బయటి వ్యక్తుల నుంచి సాధ్యమయ్యేది కాదని, లోపలున్న వ్యక్తుల ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కియా సంస్థ 2019 డిసెంబరు నుంచి కార్ల ఉత్పత్తులను సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ప్రారంభించింది. ఏడాదికి సగటున మూడు నుంచి నాలుగు లక్షల కార్ల తయారీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కార్లకు విడి భాగాలు తయారీ చేసే పరిశ్రమలు కూడా ఇక్కడే ఏర్పాటయ్యాయి. అయితే కారు ఇంజన్లు మాత్రం హ్యుందారు కంపెనీ నుంచి కియా కొనుగోలు చేస్తుంది. ఈ ఇంజన్లు తమిళనాడులోని సిర్‌పెరంబూరు నుంచి వస్తాయి. అత్యధికం 1.6 లీటర్లు, నాలుగు సిలిండర్లు కలిగినవి ఉంటాయి. ఒక్కో ఇంజను విలువ సుమారు రూ.ఐదు లక్షలకుపైగా విలువ ఉండే అవకాశం ఉందని మెకానికల్‌ నిపుణులు చెబుతున్నారు.

యాజమాన్యం మౌనం వెనుక సందేహాలు

900 ఇంజన్లు ఒకేసారి పోలేదని, 2020 నుంచి ఇప్పటి వరకు పోయినవిగా తెలుస్తోంది. ఈ ఇంజన్ల దొంగతనం గోల్‌మాల్‌ వెనుక ఇండెంట్‌ విషయంలోనే మతలబు నడిచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కోసారి నాలుగు ఇంజన్లు ఇండెంట్‌ పెడితే ఐదు పంపినట్లుగా రికార్డుల్లో ఉందన్న ప్రచారం నడుస్తోంది. అంటే యాజమాన్యం లెక్కల్లోనూ కొంత గందరగోళం నెలకొనడంతో అవకాశంగా తీసుకున్న కొందరు ఇంజన్ల దొంగతనానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహరాన్ని నిశితంగా దర్యాప్తు చేసి 900 ఇంజన్లు ఏ రకంగా బయటకు పోయాయన్నది పరిశీలిస్తామని శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు చెబుతున్నారు. దొంగతనం వ్యవహారంపై మాత్రం కియా యాజమాన్యం ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. ఇందులో ఏ మాత్రం పెదవి విప్పినా ఇండింట్‌ వ్యహారాలు వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉంటోందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడితే ఇంజన్ల మాయం వ్యవహారం మొత్తం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

➡️