దాహం..దాహం

May 16,2024 07:07 #Kurnool, #Water Problem

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 193 సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకులు ఉన్నాయి. వాటిలో 10 శాతం ట్యాంకులు అడుగంటాయి. మిగిలిన వాటిలోనూ 50 శాతంలోపే నీరు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 32 సిపిడబ్ల్యుసి నీటి పథకాల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. 4,261 చేతి పంపులు ఉండగా వాటిలో వేసవి వస్తే 210 చేతి పంపుల్లో నీళ్లు రావడం లేదు. మిగిలిన వాటిలోనూ అరకొరగా నీళ్లు వస్తున్నాయి. 796 పిడబ్ల్యు పథకాలు ఉండగా వాటిలో 692 మాత్రమే పని చేస్తున్నాయి. గ్రామాల్లో నీటి సమస్య తప్పడం లేదు.
కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి, కోసిగి, పెద్దకడబూరు, హోళగుంద, గోనెగండ్ల, మంత్రాలయం మండలాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కౌతాళం మండలం వల్లూరు, హాల్వి గ్రామాల మధ్య 30 ఎకరాలల్లో రూ.10 కోట్లతో 12 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించారు. ట్యాంకుకు సరఫరా చేయడానికి సామర్థ్యం తక్కువ ఉన్న మోటార్లు ఉండడంతో నీరు నిల్వ చేయలేకపోయారు. తుంగభద్ర నది ఎడారిగా మారడంతో ఎస్‌ఎస్‌ ట్యాంకులు వెలవెలబోతున్నాయి. దీంతో 12 గ్రామాలకు సరఫరా కావాల్సిన నీరు కేవలం రెండు మూడు గ్రామాలకు సరఫరా అవుతున్నాయి. దీంతో కుంభాలనూరు, కాత్రికి, గుడికంబాళి, గోతులదొడ్డి, హాల్వి గ్రామాలకు నేటి సరఫరా అంతంత మాత్రమే ఉండడంతో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. హాల్వి గ్రామంలో ప్రత్యామ్నాయంగా రెండు బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో ప్రత్యామ్నాయాలు లేక ప్రజలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఆదోని మండలం మధిరలో తాగునీటి కోసం ప్రజలు బోరుపైనే ఆధారపడి ఉన్నారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో బోరులో నీరు రాక ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదోని మండలం జాలమంచి, గణేకల్‌, పాండవగల్‌, బసాపురం, పెద్దహరివాణం, సంతేకుడ్లూరు, బైచిగేరి, కపటి, నెట్టేకల్‌, సాంబగల్‌, పెద్దపెండేకల్‌, చిన్నపెండేకల్‌, దిబ్బనకల్‌ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి పథకాలకు తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో తాగునీటి దప్పిక తీర్చుకోవడమే రోజంతా పని చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం, తారాపురం, గంగులపాడు, జాలవాడి, గవిగట్టు, కమ్మలదిన్నె, హెచ్‌.మురవని గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. చిన్నతుంబళం, గంగులపాడు గ్రామాల్లో పదిరోజులకు ఒకసారి కూడా నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కమ్మలదిన్నె, జాలవాడి గ్రామాల్లో ప్రజలే పది కుటుంబాలు కలిసి సొంతంగా బోర్లు వేసుకొని వాడుకుంటున్నారు. తాగటానికి ఫిల్టర్‌ నీటిని డబ్బులు పెట్టి కొనుకునే పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాల్లో ఆర్‌ఒ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపయోగంలో లేవు. గవిగట్టు గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. హెచ్‌.మురవని గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసుకుంటున్నారు. హాలహర్వి మండలం బల్లూరులో నీటి ఎద్దడి వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో వేదవతి నది లోపల చెలిమి తోడి నీటిని తోడుకుంటున్నారు. మండలంలోని కుక్కరచేడు, బెవినహళ్‌, ఛాగిబండ, సిద్ధాపురం, బల్లూరు గూళ్యం, మచనూరులోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మండల కేంద్రమైన ఆస్పరితో పాటు తురవగల్లు, ఐనేకల్లు, తోగలగల్లు, డి.కొటకొండ, బైలు పత్తికొండ, గార్లపెంట, ములుగుందం, జోహరపురం, దొడగొండ, హలిగేర గామాల్లో నీటి ఏద్దడి నెలకొంది. పుప్పాలదొడ్డి గ్రామంలో 130 కుటుంబాలు ఉండగా 947 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ప్రధానంగా నీటి సరఫరా కోసం గ్రామ సమీపంలోని చెరువులో రెండు బోర్లు వేయించారు. చెరువులో భూగర్భ జలాలు అడుగంటడంతో అరకొర నీటి సరఫరా అవుతోంది. నీటి కోసం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆలూరు పట్టణంలో 15 రోజులకోసారి తాగునీరు వస్తున్నాయి. హాలహర్వి మండలం బాపురం పథకం నుంచి సరఫరా అవుతోంది. వేసవికి ముందుగానే తాగునీటి కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కర్నూలు కార్పొరేషన్‌లో పరిస్థితి ఇదీ..
కర్నూలు జనాభాకు రోజూ 120 ఎంఎల్‌డి నీరు అవసరం కాగా ప్రస్తుతం 85 ఎంఎల్‌డి నీరు అందిస్తున్నారు. నగరానికి తాగునీటి అవసరాలు తీర్చే సుంకేసుల జలాశయం నుంచి నీరు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. అక్కడ కూడా నీరు అడుగండిపోవడంతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చుకొని వాడుకునే పరిస్థితి నెలకొంది. నగరంలోని 52 వార్డుల్లోనూ నీటి ఎద్దడి ఉండగా లక్ష్మీపురం, పెద్దపాడు, పందిపాడులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నగర పాలక సంస్థ సరఫరా చేసే ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ట్యాంకర్లు వచ్చినప్పుడు వంతుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. నీటి యుద్ధాలు కూడా తప్పడం లేదు. మూడురోజులకోసారి ట్యాంకర్‌ వస్తుండడంతో పట్టుకున్న నీరు మూడు రోజులకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీరు తక్కువగా ఉండడంతో ఏప్రిల్‌ 1 నుంచి రోజు విడిచి రోజు తాగునీరు విడుదల చేస్తున్నట్లు కమిషనర్‌ భార్గవ్‌ తేజ్‌ ప్రకటించారు.

➡️