- బిఎస్‌ఎఫ్‌లో పాతికేళ్ల సర్వీస్
- విఆర్‌ఎస్ తీసుకొని
- 16 నెలలు గడిచినా అందని పెన్షన్
- పిడిఎఫ్ ఫైలు డ్యామేజ్ అయిందంటూ కుంటిసాకులు
న్యూఢిల్లీ : ఆయన పేరు హవల్దార్ గౌతమ్ బుచర్. సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)లో పాతిక సంవత్సరాల 17 రోజుల పాటు పనిచేశారు. 2023 జూలై 31న స్వచ్ఛంద పదవీవిరమణ పొందారు. విఆర్‌ఎస్ తీసుకున్న వారికి సాధారణంగా ఒకటి రెండు నెలల సమయంలోనే పెన్షన్ రావడం మొదలవుతుంది. అయితే ఈ మాజీ హవల్దార్‌కు నేటికీ పెన్షన్ చేతికి అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. బిఎస్‌ఎఫ్‌కు చెందిన 31వ బెటాలియన్ ఆయన పెన్షన్ కేసును సంబంధిత విభాగానికి పంపింది. అక్కడి నుండి మరో కార్యాలయానికి వెళ్లింది. వారు ఆ ఫైలును వెనక్కి తిప్పిపంపారు. అందుకు వారు చూపిన కారణం వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పిడిఎఫ్ రూపంలో పంపిన ఫైలు డ్యామేజీ అయిందని, అందువల్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సాధ్యపడడం లేదని వారు తెలియజేశారు.
ఇపిఎఫ్‌ఓకు చెందిన ‘భవిష్య పోర్టల్’లో మాజీ హవల్దార్ పిడిఎఫ్ ఫైలు కన్పించడం లేదు. ఫలితంగా ఆ మాజీ సైనికుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బిఎస్‌ఎఫ్, తపాలా శాఖ, ప్రధానమంత్రి…ఇలా అన్ని విభాగాలకు, పాలకులకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా మాజీ హవల్దార్ గౌతమ్‌కు నేటికీ ఊరట లభించలేదు. సమస్య పరిష్కారం కోసం బిఎస్‌ఎఫ్ 31వ బెటాలియన్ కమాండెంట్ ‘భవిష్య పోర్టల్’ సాంకేతిక బృందాన్ని సంప్రదించారు. అయినా ఒరిగిందేమీ లేదు.
తనకు పెన్షన్ జారీ చేయడంలో జరుగుతున్న జాప్యానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గౌతమ్ కోరుతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 30న ఆయన ప్రధాని మోడీకి ఓ లేఖ రాస్తూ తన గోడు వెళ్లబోసుకున్నారు. పెన్షన్ అనేది అలవెన్సు కాదని, అది ప్రాథమిక హక్కు అని ఆయన ఆ లేఖలో తెలియజేశారు. దేశం కోసం రక్షణ, పౌర సేవలు అందించిన ఓ సైనికుడికి లభించిన గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.