- పి-4 సర్వేలో లోపించిన పారదర్శకత
- బియ్యం కార్డులే ప్రామాణికం
- వలస కార్మికులకు జాబితాల్లో దక్కని చోటు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పి-4 సర్వేలో పారదర్శకత లోపించింది. పేదల గుర్తింపునకు బియ్యం కార్డునే ప్రామాణికంగా తీసుకుంది. దీంతో, బియ్యం కార్డులేని వారికి, వలస కార్మికులకు, ఎటువంటి చేయూత లేదని వారికి జాబితాలో చోటు దక్కలేదు. రాస్ట్రంలో 20 నెలులుగా బియ్యం కార్డుల జారీ నిల్చిపోవడంతో పేదలైనప్పటికీ పి-4 సర్వేకు దూరమయ్యారు. .రేషన్ కార్డు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి పింఛను పొందుతున్న వారిని, విద్యుత్ రాయితీ పొందుతున్న ఎస్‌సి, ఎస్‌టిలను ఈ సర్వేలో మినహాయించారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి జిల్లాల నుంచి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ కుటుంబాల వారిని బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిలో 20 శాతం కుటుంబాలను నిరుపేదలుగా గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికనుగుణంగా 29 లక్షల కుటుంబాలను గుర్తిం చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే కుటుంబ ఆర్ధిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు గరిష్టంగా రూ.15 వేలు వస్తుండడంతో గత ప్రభుత్వం వీరికి బియ్యం కార్డులు తొలగించింది. 60 ఏళ్లు నిండాక వీరు ఉద్యోగం కోల్పోతున్నా వారికి తిరిగి బియ్యం కార్డులు ఇవ్వడం లేదు. గత 20 నెలలుగా బియ్యం కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపో యింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైసిపి ప్రభుత్వం 2021లో నవశకం సర్వే పేరుతో ఆరెంచెల విధానాన్ని అమలు చేసి 7.5 లక్షల కార్డులను రద్దు చేసింది. ఆ తరువాత దశల వారీగా కొన్నింటిని పునరుద్ధరించినా దాదాపు ఐదు లక్షల కుటుంబాల వారు తెల్ల రేషన్ కార్డుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కుటుంబాలన్నీ పి-4 సర్వేకు వెలుపలే ఉన్నాయి. బియ్యం కార్డులు ఉన్న వారిలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియో గాన్ని ప్రమాణికంగా తీసుకుని నిరుపేదలుగా పరిగణించి సంబంధిత జాబితాలను గ్రామ, వార్డు సచివాలయా లకు అధికారులు పంపినట్టు తెలుస్తోంది. ప్రభుత్వమే పేదరికంలో ఉన్న వారి జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపగా, సచివాలయాల ఉద్యోగులు వీరి వద్దకు వెళ్లి బయోమెట్రిక్ లేదా ఒటిపి ద్వారా వారు స్థానికంగా ఉంటున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి వసతి, సరైన జీవనం లేనివారిని గుర్తించినట్టు చెబుతున్నా కేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యుత్ వినియోగం 200 యూనిట్లలోపు ఉన్న వారిలో వారి కుటుంబంలో ఎవరికీ గణించదగ్గ ఆదాయం, ఆధార్ లింకుతో పరిశీలిస్తే ఎక్కడా ఎటువంటి ఆదాయం ఉన్నట్టు కన్పించని వారిని అధికారులే గుర్తించి సచివాల యాలకు పంపినట్టు తెలుస్తోంది. కానీ, వీరి కన్నా అతి నిరుపేదలుగా ఉన్న వారు, కుటుంబాల్లో ఒంటరిగా ఉన్న వారు, పింఛన్లు లేని రిటైర్డు కార్మికులు, ఉద్యోగులు పి-4 సర్వేలోకి రాలేదు. వలస కార్మికులను అసలు పట్టించుకోలేదు. సచివాలయాల పరిధిలో మ్యాపింగ్ జరిగిన వారిని మాత్రమే గుర్తించారు. బీహార్, బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కార్మికులు భవన నిర్మాణ రంగంలో కీలక భూమిక పోషిస్తుంటారు. వీరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వీరిని గుర్తించడం లేదు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వలస కార్మికులున్నారు. వీరిలో కొందరికి పి-4 జాబితాలో చోటు దక్కలేదు. పట్టణాల్లో ట్యాప్ కనెక్షన్లు, పక్కా నివాసం ఉన్న వారిని పేదలుగా పరిగణించ లేదు. నెలవారీ విద్యుత్ వినియోగం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగంతోపాటు ఆదాయ పన్ను, జిఎస్‌టి రిటర్నులు, సొంత ఆస్తి, ఇల్లు, నాలుగు చక్రాల వాహనం, ఆదాయ మార్గాలు అద్దె, వడ్డీ, పింఛన్లు పొందుతున్న వివరాలను ముందే తెలుసుకున్న ఇందుకు సంబంధించిన వారి డేటాను పరిగణలోకి తీసుకోలేదు. నిరుపేదలు, అభాగ్యులు, ఎటువంటి చేయూతలేకుండా అన్న క్యాంటీన్లకు వస్తున్న అనేకమందిని కూడా ఈ జాబితాల్లోకి చోటు దక్కలేదు.