- రెండు ఘటనలకూ సారూప్యతలు
- హింస, కోర్టులలో పిటిషన్లతో హిందూత్వ శక్తుల వ్యూహాలు
- సర్వే సమయంలో సంభాల్ రణరంగం
- ముస్లిం సమాజమే టార్గెట్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవలి హింసాత్మక ఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో? అన్న భయాందోళన మేఘాలు ఆవరించాయి. ప్రస్తుత పరిస్థితులు అదే రాష్ట్రంలోని ‘అయోధ్య’లో గతంలో చోటు చేసుకున్న హింసను, ఘటనలను గుర్తు చేస్తున్నాయి. రామ మందిర నిర్మాణం పేరుతో బాబ్రీ మసీదును కూల్చివేసిన హిందూత్వ శక్తులు.. ఇప్పుడు సంభాల్‌లోని షాహీ జామా మసీదును టార్గెట్ చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే అయోధ్యలోని ఫార్ములాను హిందూత్వ శక్తులు పాటిస్తున్నాయని చెప్తున్నారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపీ, మథురలోని షాహీ ఈద్గా కేసుల్లోనూ ఇదే సారుప్యతను చూడొచ్చని వారు అంటున్నారు. మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేదంటూ మొదట కోర్టును ఆశ్రయించటం, ఆ తర్వాత సర్వేలకు న్యాయస్థానాలు ఆదేశించిటం వంటివి ఇందులో కనిపిస్తాయని అంటున్నారు. ఇప్పుడు సంభాల్ మసీదు విషయంలోనూ ఇదే జరుగుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
రెండో సర్వేతో చెలరేగిన హింస
ఈనెల 24న షాహీ జామా మసీదులో అధికారుల సర్వే విషయమై అక్కడి స్థానికులు వ్యతిరేకించటం, ఆ తర్వాత పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే. ఆందోళన చేస్తున్న స్థానికులను కట్టడి చేయటానికి పోలీసులు భాష్ఫవాయువును ప్రయోగించటమే గాక కాల్పులు సైతం జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులతో మొత్తం 30 మందికి పైగా గాయాలైనట్టు సమాచారం.
ఆ తర్వాత ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రాజకీయంగానూ విమర్శలకు దారి తీసింది. ఈ హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..దీనికి బిజెపిదే బాధ్యత అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఘటనతోనే సంబంధం లేని తమ పార్టీ ఎంపీ జియాఉర్ రహ్మన్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడిపై కేసులు పెట్టటాన్ని తప్పుబట్టారు. కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారం అల్లర్లు జరిగేలా చేసి, వారిపై కేసులు నమోదు అయ్యేలా చేసిందని యోగి సర్కారుపై ఎస్‌పీ ఆరోపణ. అయోధ్య అంశంలోనూ ఇదే విధమైన హింస చెలరేగి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందనీ, ఇప్పుడు సంభాల్ కూడా అవే పరిస్థితులను ఎదురు చూస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
జిల్లా యంత్రాంగంపై బాధిత కుటుంబాల ఆగ్రహం
అల్లర్ల సమయంలో స్థానిక జిల్లా యంత్రాంగం, పోలీసులు వ్యవహరించిన తీరుపై మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న గుంపుపై పోలీసులు కాల్పులు జరిపారని అంటున్నారు. మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్, లాయర్ జాఫర్ అలీ సైతం అధికారులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపారు. మసీదులోని వాటర్ ట్యాంకును సబ్-డివిజనల్ మేజిస్ట్రేటు ఖాళీ చేయించి, దానిని తనిఖీ చేయాలని చెప్పటంతో నిరసనకారుల్లో ఆందోళన వ్యక్తమైందని తెలిపారు. మసీదుల్లో తవ్వకాలు జరుపుతారేమోనని స్థానికులు భావించారని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో పోలీసు కాల్పుల వీడియో వైరల్
పోలీసులు తుపాకులతో కాల్పులు జరుపుతున్నటువంటి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం గమనార్హం. దీంతో, అధికారులు, పోలీసుల వాదనల పట్ల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే గుంపుపై కాల్పులు జరపాలని పోలీసు అధికారులు, జిల్లా మేజిస్ట్రేటు చర్చించుకుంటున్న సమయంలో తాను ఉన్నానని జాఫర్ అలీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే పోలీసులు జాఫర్ అలీని కస్టడీలోకి తీసుకోవటం గమనార్హం. గుంపు కాల్పులు జరిపిందని పోలీసులు చెప్తున్నారనీ, అయితే నిరసనకారులు ఒకరినొకరు చంపుకుంటారని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనల అనంతరం ఇప్పుడు ఈ వాదన సంభాల్‌లోని ముస్లిం సమాజంలో వినిపిస్తున్నది. పోలీసు వాదనల్లో లాజిక్ లేదనీ, తొందరపాటుగా సర్వేకు ఆదేశించి, నిర్వహించిన విధానం ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తున్నదనటానికి ఒక రుజువని అక్కడి స్థానికులు అంటున్నారు.
సర్వేపై సమాచారం కూడా లేదు..
అయితే, రెండో సర్వే కోసం నవంబర్ 24న అధికారులు మసీదు వద్దకు చేరుకోవటంతో సంభాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సర్వే గురించి తమకు సమాచారం లేదని స్థానికులు చెప్పారు. రెండోసారి సర్వే విషయంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలిపారు.
నవంబర్ 19 నాటి సర్వే కంటే పెద్ద మొత్తంలో పోలీసులు మసీదు వద్ద మోహరించారని మసీదుకు దగ్గరలో నివసించే స్థానికుడు ఇష్తియాక్ హుస్సేన్ తెలిపాడు. రెండో సారి జరిపిన సర్వే గురించి తమకెవరికీ సమాచారం లేకపోవటంతో, ఏదో జరగబోతున్నదన్న ఆందోళన, భయం అందరిలో నెలకొన్నదనీ, దీంతో మసీదుకు వెళ్లే దారి పెద్ద జనంతో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. రెండోసారి జరిపిన సర్వే సమయంలో హిందూ పిటిషనర్ల తరఫున 20 మంది మసీదులోకి వెళ్లారనీ, ముస్లిం సమాజం నుంచి జాఫర్ అలీ ఒక్కడే ఉన్నాడని చెప్పారు. హింసలో చనిపోయిన మృతుల బంధువులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ,తమ పిల్లలు, తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు.