ఉండిలో ‘రఘురామ’ చిచ్చు

  • ఇప్పటికే రెబల్‌ అభ్యర్థిగా శివ ప్రచారంతో తలనొప్పులు
  •  తాజాగా టిడిపి అభ్యర్థి మంతెన రామరాజు మార్పు చర్చతో రాజీనామా హెచ్చరికలు
  • రసవత్తరంగా పశ్చిమ డెల్టా రాజకీయం

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్దండుల నియోజకవర్గంగా పేరొందిన ఉండి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే టిడిపి కేటాయించింది. దీంతో ఈ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (శివ) స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించి ప్రచారం ప్రారంభించారు. దీంతో టిడిపికి కంచుకోటగా పేరొందిన ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు శివ, రామరాజు గ్రూపులుగా చీలిపోయారు. ఈ పరిస్థితుల్లో రఘురామ కృష్ణరాజు టిడిపిలోకి ఎంట్రీతో ఆ పార్టీ శ్రేణులు కకావికలమయ్యే పరిస్థితి దాపురించింది.
వైసిపి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచే స్వయంగా జగన్‌పైనే విమర్శలు ఎక్కుపెడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో విమర్శలు గుప్పిస్తూ.. బిజెపి జాతీయ నేతలకు సన్నిహితంగా ఉన్న వైసిపి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజు టిడిపి నుంచి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారనే ప్రచారమే దీనికి కారణం. వైసిపి నేతలకు కొరకరాని కొయ్యగా మారిన రఘురామ తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనంటూనే టిడిపి కూటమి నుంచి ఎంపి అభ్యర్థిగా కచ్ఛితంగా బరిలోకి దిగుతానని తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభలో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నరసాపురం ఎంపి అభ్యర్థిగా బిజెపి తరఫున రఘురామ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే నరసాపురం ఎంపి సీటు బిజెపికే దక్కినా టికెట్‌ మాత్రం రఘురామకు కాకుండా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు దక్కింది. దీంతో ఇప్పటి వరకూ వైసిపిని ఇరుకున పెట్టిన రఘురామ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అయినా ఏమాత్రం జంకకుండా బిజెపి జాతీయ నేతలతో సన్నిహితంగా ఉన్నా.. రాష్ట్ర నేతలతో సత్సంబంధాలు లేకపోవడమే ఈ పరిణామానికి కారణమని, త్వరలోనే తానే కూటమి తరఫున అభ్యర్థినవుతానంటూ బీరాలు పలికారు. ఏమైందో ఏమోగాని బిజెపి తన అభ్యర్థి మార్పునకు ససేమిరా అనడంతో రఘురామ ఎక్కడోచోట అవకాశం కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. అదే క్రమంలో ఉండి నుంచి పోటీ చేసి గెలుపొందడం ద్వారా హోంమంత్రి పదవి చేజిక్కించుకుని వైసిపి అధినేతను తన పవరేమిటో చూపించాలనే తపనలో రఘురామ ఉన్నారనే ప్రచారమూ పెద్దయెత్తున సాగింది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో ఆయన ఉండి నుంచి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరింది. అయితే అనూహ్యంగా మరుసటి రోజే పాలకొల్లు నుంచి బయల్దేరుతున్న చంద్రబాబు కాన్వారును ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రామరాజును విజయవాడ పిలిపించి చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేసినా పార్టీ శ్రేణులు, కుటుంబంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వెనుదిరిగారు. వెనువెంటనే నియోజకవర్గంలో మండలస్థాయి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ‘నన్ను పోటీ నుంచి తప్పుకోమంటున్నారు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. తాను రాజకీయాల్లో ఉంటే పోటీ చేస్తానని, లేనిపక్షంలో రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని, తన అడుగులు ఎటు అనేది కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రామరాజు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి తన తరఫున ప్రచారానికి రావాలని రఘురామ కృష్ణరాజు ఆహ్వానించడం, తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది 48 గంటల్లో తేలుతుందని ప్రకటించడం ఆయన ఉండి నుంచి బరిలోకి దిగనున్నారని స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే చర్చ పెద్దయెత్తున సాగుతోంది. ఇప్పటికే టిడిపి రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు వెనక్కి తగ్గుతారా లేక పోటీలో కొనసాగుతారా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే రఘురామకు, మాజీ ఎమ్మెల్యే శివకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ శివ పోటీ నుంచి తప్పుకుని రఘురామ వెంట నడిస్తే రామరాజు బరిలో ఉన్నా వైసిపి, టిడిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. లేనిపక్షంలో రఘురామ టిడిపి అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థులుగా రామరాజు, శివ బరిలో ఉంటే ఆ నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి మూడు గ్రూపులుగా మారి వైసిపికి కలిసొచ్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే టిడిపి ఆవిర్భవించాక 1983 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఒక 2004లో మినహా మిగిలిన అన్నిసార్లూ టిడిపి అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009లో కాంగ్రెస్‌, 2019లో వైసిపి గాలి వీచినా ఇక్కడ మాత్రం టిడిపి అభ్యర్థులే గెలుపొందడం దీనికి నిదర్శనం. ఈ క్రమంలో రఘురామ రాకతో టిడిపి చీలికలు పేలికలుగా మారుతోందని ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నర్సింహరాజు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో మంతెన రామరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఏదేమైనా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో వేచిచూడాలి.

అక్షరాయుధాలందించిన ఘనత ‘ఉండి’ సొంతం
ఉండి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో స్వాతంత్య్రోద్యమానికి ఊపిరిగా ఉండే ప్రసార సాధనాలైన పత్రికలన్నీ రహస్యంగా ముద్రించి పడవలు, దోనెల్లో ప్రజలకు చేరవేసిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. దండి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా ఉద్యమానికి రహస్యంగా అక్షరాయుధాలందించిన ఘనత కూడా ఉంది. అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు ఈ నియోజకవర్గంలోనే ఉంది. హైదరాబాద్‌ ఇసిఐఎల్‌ ప్రాంతంలో ఎఎస్‌రావు నగర ఆవిర్భవానికి ఆద్యుడు అయ్యగారి సాంబశివరావు, స్వామి జ్ఞానానంద వంటి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి చెందిన వారే. ఉండి నియోజకవర్గంలోని నాయకులు ఉన్నత పదవులు అలంకరించిన వారే ఉన్నారు. కలిదిండి రామచంద్రరాజు.. ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో చిన్న తరహా మంత్రిగా, చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. టిటిడి ఛైౖర్మన్లుగా పాందువ్వ కనకరాజు, కలిదిండి రామచంద్రరాజు, గాదిరాజు జగన్నాథరాజు, గోకరాజు రంగరాజు, కనుమూరు బాపిరాజు, టిటిడి బోర్డు సభ్యులుగా గోకరాజు రామరాజు పనిచేశారు. నర్సాపురం మాజీ ఎంపి, బిసిసిఐ మాజీ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజుది ఈ నియోజకవర్గమే. పశ్చిమగోదావరి జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుది కూడా ఈ నియోజకవర్గమే.

➡️