- వెతుకులాటలో సర్కారు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పి-4 (పబ్లిక్, ప్రైవేటు, ఫిలాంధ్రిపిస్ట్ భాగస్వామ్యం)కు పెద్దగా స్పందన కనిపించడం లేదని సమాచారం. ధనవంతులైన దాతల సహకారంతో పేదరికాన్ని నిర్మూలిండం ఈ విధాన సారాంశం. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ఈ తరహా కార్యక్రమాలకు ధనవంతులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిడీలో పలు పరిశ్రమల యజమానులు కొంత మొత్తాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసే విధానం ఉండేది. దానికి ఎంతో కొంత స్పందన కూడా కనిపించేదని చెబుతున్నారు. తాజా విధానంలో భాగంగా ఎన్ని సమీక్షలు నిర్వహించినా, ఎన్ని సార్లు పిలుపులు ఇచ్చినా ధనవంతుల నుండి ఆశించిన స్థాయిలో కదలిక లేదని అంటున్నారు. దీంతో. కొంతమంది ఆర్థిక దిగ్గజాలతో నేరుగా సంప్రదింపులు చేసేందుకు కూడా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే సరైన స్పందన మాత్రం రాలేదని చెబుతున్నారు.
త్వరలో ఉన్నతస్థాయి భేటీ
దీంతో రాష్ట్రంలోని ధనవంతులైన పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారితో నేరుగా భేటీ కావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సమాజసేవపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి, వారిని నేరుగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఆలోచనను స్వయంగా వినిపించి పేదలను ఆదుకునేలా ఒప్పించాలని యోచిస్తున్నారు.
ముందుగా తొలి పది మందిని ఒప్పిస్తే తరువాత కాలంలో మిగిలిన వారు కూడా స్వతంత్రంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
ధనికుల జాబితాపై దృష్టి
పి-4ను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్రంలో ఉన్న ధనికుల వివరాలను సేకరించే పనిలో ప్రణాళిక శాఖ అధికారులు నిమగమై ఉన్నారు. అదే విధంగా విదేశాల్లో ఉన్న తెలుగువారిలో పి-4కు సహకరించే ఆసక్తి ఉన్న వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే మరోసారి పి-4 అమలుపై కీలక సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు.