వర్మ వర్సెస్‌ జనసేన

Jun 9,2024 10:39 #Former TDP MLA Varma, #JanaSena, #TDP
  • భగ్గుమన్న గ్రూపుల విభేదాలు
  • పిఠాపురంలో రాజుకున్న అగ్గి
  • ఇరు శిబిరాల్లోనూ అనుమాన బీజాలు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపొందిన పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో శుక్రవారం రాత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడితో టిడిపి, జనసేన మధ్య గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్‌ టిడిపి ఇన్‌ఛార్జ్‌ వర్మ అన్నట్టుగా వ్యవహారం ముదురుతోంది. ప్రభుత్వం ఏర్పడక ముందే, ఎంఎల్‌ఎలు బాధ్యతలు స్వీకరించక ముందే సోషల్‌ మీడియా వేదికగా ఇరు శిబిరాలు చేస్తున్న విమర్శ, ప్రతి విమర్శల నేపథ్యంలో మిత్రపక్ష నేతల మధ్య తగాదా ఏ పరిణామాలకు దారి తీయనుందోననే చర్చ జరుగుతోంది.

ఎన్నికల ముందు నుంచే..
రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన పొత్తుతో బరిలో దిగాయి. పిఠాపురం నుంచి టిడిపి సీటును మాజీ ఎమ్మెల్యే వర్మ ఆశించారు. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలో దిగుతున్నట్టు ప్రకటించడంతో వర్మ శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. చివరకు చంద్రబాబు జోక్యంతో వర్మ మెత్తబడి పవన్‌ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తన గెలుపు బాధ్యతను వర్మ చేతుల్లో పెడుతున్నట్టు ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ 70 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆశించిన విధంగా లక్షకుపైగా ఓట్ల మెజార్టీ రాకపోవడానికి వర్మే కారణమంటూ కౌంటింగ్‌ అనంతరం జనసేన నాయకులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో శుక్రవారం రాత్రి వర్మపై దాడి జరిగింది. కాకినాడ ఎంపి తంగేళ్ల ఉదరు శ్రీనివాస్‌ అనుచరులే తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. దీంతో, జనసేన భగ్గుమంటోంది. ఎన్నికలకు ముందే సమన్వయ సమావేశం సందర్భంగా నేరుగా వర్మ, ఉదరు శ్రీనివాస్‌ మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు
కాకినాడ వైసిపి మాజీ ఎంఎల్‌ఎతో వర్మ చేతులు కలిపి భారీగా సొమ్ములు తీసుకున్నారని జనసేన సోషల్‌ మీడియా వేదికగా ఆరోపిస్తుండగా, వర్మ అనుచరులు అదే స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు. ఎన్నికల్లో సీటు త్యాగం చేసి పవన్‌ కల్యాణ్‌ విజయానికి అహర్నిశలు శ్రమించిన వర్మపై ఇటువంటి ఆరోపణ చేయడాన్ని తప్పు పడుతున్నారు. నియోజకవర్గంలో వర్మను కట్టడి చేసేందుకు, ఎంఎల్‌సి అవకాశం దక్కకుండా ఉండేందుకు జనసేన కీలక నేతలు కుట్రపూరితంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️