Vision 2047: ప్రైవేట్‌ వలయంలో పారిశ్రామిక రంగం

Jan 19,2025 03:17 #2047 Vision, #Industrial Policy

వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడాలన్నా, తలసరి ఆదాయం పెరగాలన్నా పారిశ్రామిక రంగంలో పురోగతి అవసరం. ఏ ప్రణాళిక అయినా రాష్ట్రంలోని నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఉండాలే తప్ప నేల విడిచి సాము చేయసవదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన ‘స్వర్ణాంధ్ర విజన్‌ -2047’ లో భాగంగా ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితికి, అందులో పేర్కొన్న లక్ష్యాలకు పొంతనే కుదరడం లేదు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రభుత్వ రంగం ప్రాధాన్యతను పూర్తిగా విస్మరించారు. రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు, ఇన్వెస్టర్లకు అనువైన ఎకో సిస్టమ్‌ ఏర్పాటు, చౌక లేబర్‌, తక్కువ ఉత్పత్తి వ్యయం చూసి పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూ కడతారన్నట్లుగా ఓ రంగుల కలను ఈ విజన్‌ డాక్యుమెంట్‌ మన ముందు ఉంచుతున్నది.. గత ఏడాది మార్చిలో జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం ప్రాధాన్యతల్లో కొన్ని మార్పు చేర్పులు చేసి వచ్చే అయిదేళ్లకు వర్తించేలా ఈ కొత్త పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. పాత విధానంలో కల్పించిన వాటికి అదనంగా కొన్ని రాయితీలను ఇందులో ప్రకటించింది. మెకెన్సీ రూపొందించిన విజన్‌ -2020 ఓ ప్రహసనంగా ఎలా ముగిసిందో చూశాం. ఆ కాలంలో రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక అసమానతలు విజృంభించాయి. చివరికి ప్రాంతీయవాదంతో రాష్ట్రం రెండు ముక్కలైంది. ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని విభజనానంతర అవశేషాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పంథాను రూపొందించుకోడానికి బదులు రాష్ట్రాన్ని సంక్షోభ ఊబిలోకి నెట్టే నయా ఉదారవాద విధానాలనే మరింత జోరుగా అమలు చేసేందుకు పూనుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రకటించిన వికసిత్‌ భారత్‌-2047కి అనుగుణంగానే స్వర్ణాంధ్ర విజన్‌-2047 తీసుకొస్తున్నట్లు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. మోడీ ‘వికసిత్‌ భారత్‌’ అన్నా, చంద్రబాబు విజన్‌ -2047 అన్నా వీటి వెనక ఉన్న ఫిలాసఫీ ఒక్కటే. ”ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల లాభాలే ముందు” అన్నదే వాటి లక్ష్యం. దీని నుంచి పుట్టుకొచ్చినవే చంద్రబాబు తారక మంత్రంగా పఠిస్తున్న ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పి-4 వంటి నినాదాలు. గత ప్రభుత్వం పోర్టులు, ప్రాజెక్టులు అదానీకి కట్టబెట్టి ఆంధ్ర ప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చివేస్తే, .ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే విధానాలను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను పొందడం కోసం అదానీ భారీగా ముడుపులు ముట్టజెప్పారని సాక్షాత్తూ అమెరికా న్యాయశాఖ అక్కడ కోర్టులో కేసు దాఖలు చేస్తే, అదానీతో కుదుర్చుకున్న సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకోడానికి కూటమి సర్కారు ససేమిరా అంటున్నది. పొరుగునున్న తమిళనాడు ప్రభుత్వం అదానీతో కాంట్రాక్టులను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సెకి ఒప్పందాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసిన రెండో పంచవర్ష ప్రణాళిక (1956-1961) భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వ రంగం పాత్ర గురించి నొక్కి చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వం దీనికి భిన్నంగా ప్రైవేటు పాట పాడుతోంది. సంస్కరణల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చైనా ను చూడండి అని చెప్పే మన పాలకులు అక్కడ పారిశ్రా మిక అభివృద్ధికి ప్రభుత్వ రంగమే వెన్నెముకగా ఉందన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తుంటారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాక దానికి అనుబంధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేకం వచ్చాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగయ్యాయి. అటువంటి భారీ పరిశ్రమ లు ఈ నయా ఉదారవాద విధానాల కాలంలో ఒక్కటైనా రాష్ట్రంలో నెలకొల్పగలిగామా? విభజన చట్టం హామీల్లో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాల్సి ఉంది. చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పరపతిని ఉపయోగించి వెనుకబడిన రాయలసీమ అభివృద్దికి ఎంతగానో దోహద పడే ఉక్కు ఫ్యాక్టరీ సాధించవచ్చు కదా? అ ప్రయత్నమూ చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆ పని చేయలేదు. రాష్ట్రానికి అడుగడుగునా ద్రోహం చేసిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, రాష్ట్రంలో గత పదేళ్లలో ఇన్ని లక్షల కోట్ల పెట్టు బడులు వచ్చాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని అంకెల గారడీతో ప్రజలను మభ్యపుచ్చుతున్నారు. ప్రభుత్వం వచ్చాయని చెబుతున్న 1.4 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 36 శాతం దాకా పెట్రో కెమికల్స్‌ రంగానికి చెందినవే. వీటిలో చాలావరకు ప్రభుత్వ రంగ సంస్థ పెట్టిన పెట్టుబడులేనన్న సంగతి మరువరాదు. ఉపాధి కల్పనలో ముఖ్యమైన చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోకి కూడా ఈ కాలంలో పెట్టుబడులు పెద్దగా వచ్చిందేమీ లేదు. 28 ఎక్స్‌క్లూజివ్‌ ఎంఎస్‌ఎంఇ పార్కులకు 1378 ఎకరాల భూమి కేటాయించారు. అక్కడ ఇప్పటివరకు 64 శాతం ఎంటర్‌ప్రైజెస్‌ మాత్ర మే వచ్చాయి. రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్య నెలకొన్న స్థితిలో ఎగుమతులు మరింత మందగిం చడం, పెట్టుబడులు వెనక్కిపోతుండడం వంటి బాహ్య పరిస్థితులను బొత్తిగా పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్‌జడిపి)ని డబుల్‌ డిజిట్‌కు చేర్చుతామని ప్రకటించడం వాస్తవికత అనిపించుకోదు.
దేశంలోనే మూడు ఇండిస్టియల్‌ కారిదార్లు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఎపినే అని పత్రంలో గొప్పగా పేర్కొన్నారు. వీటిలో మన రాష్ట్ర పరిధిలో ఉన్నది విశాఖ చెన్నై ఇండిస్టియల్‌ కారిదార్‌ ఒక్కటే మిగతా రెండు (హైదరాబాద్‌ -బెంగళూరు, చెన్పై -బెంగళూరు) ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. విశాఖ -చెన్నై కారిడార్‌ లో వచ్చే వాటిలో ఫార్మా, ఆక్వా వంటి కాలుష్య కారక పరిశ్రమలే ఎక్కువ. ప్రైవేట్‌ పరిశ్రమల్లో ఈ మధ్య ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణం పరిశ్రమ యాజమాన్యానికి లాభం పై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై లేకపోవడమే. పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి యాజమాన్యం సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తే చాలు అని కొత్త పారిశ్రామిక విధానం పేర్కొంది. దీంతో కార్మికుల భద్రత మరింత ప్రమాదంలో పడుతుంది. ఉపాధి, భద్రత, మెరుగైన వేతనాలు, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి 2047 నాటికి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పడం దార్శనికత అనిపించుకోదు.

  • కె. గడ్డెన్న
➡️