ఆదివాసీలకు దక్కని ఓటుహక్కు

May 16,2024 03:45
  •  40 శాతం గ్రామాలకు అందని ఓటరు స్లిప్పులు
  •  దూర ప్రాంతాలకు ఓట్లు బదిలీ
  •  పలుచోట్ల ఇవిఎం ల మొరాయింపు

ప్రజాశక్తి – అల్లూరి డెస్క్‌ : ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏజెన్సీ ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న అధికారుల మాటలు మరోసారి మాటలకే పరిమితమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓటర్లు పోటెత్తారని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. నిజానికి ఆదీవాసీలు అనేక చోట్ల ఓటుహక్కును వినియోగించుకో లేకపోయారు. అనేక ఆదివాసీ గ్రామాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. 40 శాతం ఆదివాసీ గ్రామాలకు ఓటర్లు స్లిప్పులు అందలేదు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కొందరి ఓట్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో కొన్ని చోట్ల గత ఎన్నికల కన్నా తక్కువ ఓట్లు పోల్‌అయ్యాయి. రంపచోడవరం నియోజకవర్గంలో 2019లో 78 శాతం ఓటింగ్‌ నమోదుకాగా ఈసారి మూడు శాతం మేర తగ్గింది. చింతూరు, మారేడుమిల్లి, అడ్డతీగల, ఎటపాక సహా పలు మండలాల్లో పోలింగ్‌ స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఇవిఎంల మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయకుండా ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. కూనవరం మండలంలోని రేగులపాడు గ్రామానికి చెందిన పైదా పార్వతి (42) వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచిన ఘటన పలువురిని కలిచివేసింది. ఇవిఎం ఎక్కువ సేపు మొరాయించడంతో పార్వతి అధిక సమయం క్యూలైన్‌లో నిల్చొందని, దీంతో వడదెబ్బకు గురై చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అరకులోయలోని 211, 237 పోలింగ్‌ బూత్‌ల్లోనూ, పాడేరులోని 261, 265 పోలింగ్‌ బూత్‌ల్లోనూ ఇవిఎంలు మొరాయించాయి.

ఓటరు స్లిప్పులు ఏవీ ?
అరకు, పాడేరు నియోజకవర్గాల్లో 40 శాతం ఆదివాసీ గ్రామాలకు ఓటరు స్లిప్పులను అధికార యంత్రాంగం అందించలేదని సమాచారం. అరకులోయ మండలం గుగ్గుడు పోలింగ్‌ స్టేషన్‌ బూత్‌ నెంబరు 254, బస్కి పరిధిలోని పోలింగ్‌ బూత్‌ నెంబరు 255, కొర్రగుడలోని పోలింగ్‌ బూత్‌ నెంబరు 256 పరిధిలోకి వచ్చే ఆదివాసీ ఓటర్లకు ఓటరు స్లిప్పులను అందించలేదు. పాడేరు నియోజకవర్గంలోని పాడేరు మండలం ఇరడపల్లి పోలింగ్‌ స్టేషన్‌ పరిధి 255 పోలింగ్‌ బూత్‌లో ఓట్లు ఉన్నవారికీ, చింతపల్లి మండలంలోని కిట్టుముల, కొత్తపాలెం, తాజంగి గ్రామాల ఓటర్లుకు ఓటరు స్లిప్పులు అందలేదు. ఈ పరిస్థితి దాదాపు ఏజెన్సీ అంతటా ఉంది.

ఇష్టానుసారంగా ఓట్లు బదిలీ
కనీస సమాచారం ఇవ్వకుండా పలువురి ఓట్లను సొంత గ్రామంలోని పోలింగ్‌స్టేషన్‌ నుంచి ఇతర ప్రాంతాల పోలింగ్‌ స్టేషన్లకు అధికారులు బదిలీ చేశారు. అరకువేలీ మండలంలోని సుంకరమెట్ట పోలింగ్‌ బూత్‌ 294లోని ఓటర్లును వారి స్వప్రాంతానికి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న నందిగుడ 251, మంజగుడ 252 పోలింగ్‌ కేంద్రానికి మార్చారు. బొండం పంచాయతీ 222 బూత్‌ నెంబరులోని ఓట్లును ఆరు కిలోమీటర్ల దూరంలోని రేగ పోలింగ్‌ స్టేషన్‌కు మార్చారు. పాడేరులోని ఇరడపల్లి ప్రాంతంవారి ఓట్లును ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కొత్తవలస (వంజంగి)కి బదిలీ చేశారు. చింతపల్లి మండలంలోని కిట్టుముల నుంచి తాజంగికి, కొత్తపాలెం నుంచి తాజంగికి, తాజంగి నుంచి పెదబరడకు బదిలీ చేశారు. ఆయా ప్రాంతాలు ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇలా ఓట్లు బదిలీ చేసినట్లు కొంతమందికి సమాచారం అందలేదు.

మారుమూల ప్రాంతాలకు వాహన సౌకర్యం ఏదీ ?
మారుమూల పోలింగ్‌ స్టేషన్లకు వాహనాలు సమకూర్చి ఓటర్లను ఓటు వేసేందుకు ప్రోత్సహించాల్సిన అధికార యంత్రాంగం కొన్ని మండలాల్లో ఆ విషయాన్ని విస్మరించింది. అనంతగిరి మండలంలోని పెద్దకోట పంచాయతీ వేలమామిడి, సీడివలస, పాటిపల్లితో పాటు అనేక గ్రామాల్లో ఇదే స్థితి. దీంతో వృద్ధులు, మహిళలు పలుచోట్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఏజెన్సీలో పోలింగ్‌ సమయం సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటుందన్న సమాచారాన్ని కూడా ప్రచారం చేయలేదు. ఆదివాసీలందరూ ఓటు వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎన్నికల అధికార యంత్రాంగానికి తొలినుంచీ సిపిఎం అనేక విజ్ఞప్తులు చేసింది. ఆయన స్పందించకపోవడంతో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ఓటుహక్కుకు దూరంగా మిగిలారు.

➡️