దీపం కోసం ఎదురు చూపు

  • సిలిండర్‌కు రూ.3.90 జమ
  • రెండు వారాలవుతున్నా పడని రాయితీ

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి పట్టణానికి ఆనుకొనివున్న కొత్తూరు పంచాయతీలోని శారదనగర్‌ 11 వీధిలో నివాసముంటున్న కె ఈశ్వరరావు అప్న ఇండేన్‌ సర్వీస్‌ అడహక్‌ పాకాసాసా గ్యాస్‌ ఏజెన్సీ నుంచి నవంబరు 15న యథావిధిగా రూ.850 చెల్లించి గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్నాడు. వినియోగదారుని నెంబరు 7553204813. ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానంతో ఈకెవైసి చేసుకున్నాడు. అయినా 29వ తేదీ వరకు ఆయన బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమకాలేదు. గతంలో వలె రూ.3.90 పైసలు జమైనట్లు ఆయన ఫోన్‌ నెంబర్‌కు సమాచారం వచ్చింది. తనకు ఉచిత గ్యాస్‌ రాయితీ సొమ్ము పడని విషయం ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఈశ్వరరావు వాపోయాడు. ఇతని వలె గ్యాస్‌ రాయితీ సొమ్ము పడనివారు అనేక మంది ఉన్నారు.

దీపం-2 పథకం అమల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. ఈకెవైసి చేసుకున్నా లబ్ధిదారులందరికీ రాయితీ సొమ్ము జమకావడంలేదు. టోల్‌ ఫ్రీ నెంబరు 1967కు ఫోన్‌ చేసినా పరిష్కారం కావడంలేదు. సిలిండర్‌ అందిన కొద్ది రోజుల వ్యవధిలో కొందరి ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. కొందరికి వారం రోజులు పడుతోంది. ఈశ్వరరావు వలె కొందరికి రెండు వారాలవుతున్నా రాయితీ సొమ్ము జమకావడంలేదు. సకాలంలో డబ్బులు జమకాకపోవడంతో ఉచిత గ్యాస్‌ తమకు వర్తించదన్న ఆందోళనలో లబ్ధిదారులున్నారు. గ్యాస్‌ రాయితీ సొమ్ము జమకాక నిరాశ చెందుతున్నారు. సిలిండర్‌ అందిన 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ, అమల్లో ఇంకా లోపాలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదు చేసినా ఫలితం కన్పించడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏడాదిలో నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. అందులో భాగంగా తొలి దశలో సిలిండర్‌కు రాయితీ సొమ్ము రాకపోవడంతో మిగిలిన రెండు సిలిండర్లకు డబ్బులు రావన్న నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 5.17 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో దీపం, ఉజ్వల-1, ఉజ్వల-2, సిఎస్‌ఆర్‌ (స్త్రీ), సాధారణ కేటగిరీలో గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన 3.60 లక్షల మందిని ఉచిత గ్యాస్‌ పొందడానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికి 1.37 లక్షల మంది ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకున్నారు. గ్యాస్‌ రాయితీ సొమ్ము రూ.807లు తమ ఖాతాలో జమైనట్లు సమాచారం రాక రోజూ బ్యాంకులకు వెళ్లి రాయితీ సొమ్ముపై అడిగి తెలుసుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం సిలిండర్‌ తీసుకున్న వారందరికీ రాయితీ సొమ్ము జమవుతుందని చెబుతున్నారు.

➡️