- హిందూత్వ ప్రాజెక్ట్ అమలు కోసం వ్యూహాలు
న్యూఢిల్లీ : దేశంలో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. ఇది అనేక రాజ్యాంగపరమైన చిక్కులకు దారితీయవచ్చు. రాజకీయ పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. దేశ రాజకీయాలపై తమ పట్టు నిలుపుకునేందుకు అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు బిజెపి చేస్తున్న ప్రయత్నాలలో వక్ఫ్ చట్టం తాజాది. దేశంలో మోడీ హవా తగ్గిపోతున్న సమయంలో ఈ చట్టం ద్వారా ఆయన బలప్రదర్శనకు పూనుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో మోడీ గాలి వీయకపోవడంతో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ లభించలేదు. మిత్రపక్షాల మద్దతుపై ఆయన ఆధారపడాల్సి వస్తోంది. గత దశాబ్ద కాలంలో ఇలా ఎన్నడూ జరిగింది లేదు. రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు మోడీ తన అధికారాన్ని ఉపయోగిస్తుంటారని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వాడుకున్నారని గుర్తు చేశాయి. 2047 నాటికి దేశాన్ని సంపన్న భారత్‌గా మార్చేస్తానని, మూడోసారి ప్రధానిగా ఎన్నుకుంటే దేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోడీ చెప్పుకొచ్చారు. ఇవేవీ పెద్దగా పనిచేయలేదు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానాన్ని కూడా బిజెపి కోల్పోయింది. మోడీ శకంలో బిజెపికి ఎదురైన అతి పెద్ద అవమానకరమైన ఓటమి అదే. రామ జన్మభూమి ఉద్యమానికి కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సంఖ్యాపరంగా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చేదు అనుభవాలు
లోక్‌సభ ఎన్నికలలో దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలోనూ, స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ బిజెపికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా బ్లాక్‌గా ఏర్పడి మోడీ విజయాలకు కళ్లెం వేశాయి. సొంత బలంతో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న మోడీ ఆశలు అడియాసలయ్యాయి. మోడీ తర్వాత ఎవరు అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాలలో వినిపించింది. ఎన్నికల ముందు హడావిడిగా పొత్తులు పెట్టుకున్న నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వంటి మిత్రుల సహకారంతో తన పట్టును కొనసాగించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపక్షాలే లక్ష్యం
2024 జులైలో పార్లమెంటులో తొలిసారి చేసిన ప్రసంగంలో కూడా మోడీ ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. మిత్రుల మద్దతుపై ఆధారపడుతున్నప్పటికీ నిరసనకారులు, అసమ్మతి వాదులు, విమర్శకులను అణచివేయడం ఆపలేదు. విద్వేష రాజకీయాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రతిపక్షాలు విమర్శలను పెద్దగా పట్టించు కోవడం లేదు. మోడీని విమర్శిస్తే చాలు… అది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని నిందించడం పరిపాటిగా మారింది. దేశ వైఫల్యాలన్నింటికీ కాంగ్రెస్సే కారణమని ఆరోపించడం నిత్యకృత్యమైంది. ఎన్నికలలో విజయాలు సాధించకపోతే ఇలాంటి వ్యూహాలు ఎన్ని పన్నినా ప్రయోజనం ఉండదని బిజెపికి తెలుసు. అందుకే ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టే పనిలో పడింది.
విద్వేషాలు, దాడులతో…
2024 లోక్‌సభ ఎన్నికలలో పట్టు కోల్పోయిన రాష్ట్రాలను ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా తిరిగి చేజిక్కించుకోవడంలో బిజెపి కొంతమేర సఫలీకృతమవు తోంది. హర్యానా, మహారాష్ట్రలో విజయాలు సాధించడంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికలలో జమ్మూ ప్రాంతంలో మంచి ఫలితాలు పొందింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఉత్తర ప్రదేశ్‌లో విద్వేష వ్యాప్తి బాగా పెరిగింది. గత సంవత్సర కాలంలో జరిగిన ప్రతి హిందూ పండుగనూ ముస్లింలను లక్ష్యంగా చేసుకునేం దుకే ఉపయోగించుకున్నారు. హిందువులు-ముస్లింలు లేదా లౌకికవాదులు-మతోన్మాదుల మధ్య వైరం సృష్టించడం ద్వారా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి గెలుపొందగలిగింది. ముస్లిం ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు రాకుండా రాష్ట్ర పోలీసులు అడ్డుకున్న దృశ్యాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.
హిందూత్వ ప్రాజెక్ట్ అమలు కోసమే
ఇక చివరిగా వక్ఫ్ సవరణ చట్టం. మోడీ 11 సంవత్సరాల పాలనలో పార్లమెంటులో విస్తృతంగా చర్చ జరిగింది ఈ బిల్లుపైనే అయి ఉండవచ్చు. బిజెపి దీర్ఘకాలిక హిందూత్వ ప్రాజెక్ట్ అమలు కోసం, ముస్లింలను అణచివేయడం కోసం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారన్న విషయం తెలిసిందే. ఇది ముస్లింల హక్కులను కాలరాసేందుకు తీసుకొచ్చిన బిల్లే అయినప్పటికీ హిందువులు, ముస్లిముల మధ్య ద్వేష భావాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడబోతోంది. బిల్లుపై జరిగిన చర్చలో బిజెపికి చెందిన ఏకైక ముస్లిం ఎంపీ గులాం అలీ పాల్గొన్నప్పటికీ దానికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ప్రసంగం యావత్తూ కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోయడానికే పరిమితమైంది.