నీటి సమస్య జఠిలం

Apr 25,2024 07:48 #drinking water problem, #Kurnool
  • నెలలో 20 రోజులైనా అందని నీరు
  • ఆస్పరిలో నీటి కోసం పుట్టెడు కష్టాలు
  • ఫిల్టర్‌ వాటర్‌, ట్యాంకర్లతో కొనుక్కుని తాగుతున్న ప్రజలు
  •  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని వైనం

ప్రజాశక్తి – ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా మేజర్‌ పంచాయతీ ఆస్పరిలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. నీటి కోసం ప్రజలు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా నీటి సమస్య తీవ్రం కావడంతో ప్రజలు పడుతున్న తిప్పలు వర్ణణాతీతం. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఫిల్టర్‌ వాటర్‌, ట్యాంకర్లతో కొనుక్కుని నీటిని తాగుతున్న పరిస్థితి నెలకొంది.
ఆస్పరిలో మేజర్‌ పంచాయతీలో 15, 20 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఎద్దుల బండ్లు, మోటార్‌ బైక్‌, సైకిల్‌, ఆటో ఉన్న వారు స్థానిక గాంధీ పార్కు వద్ద గుమ్మిల దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. గత్యంతరం లేక ప్రజలు ఫిల్టర్‌ వాటర్‌ ఒక్క బిందె రూ.7, ట్యాంకర్‌ రూ.800 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.గ్రామంలో 11 చేతి పంపులు ఉన్నాయి. ఇందులో రెండు వర్షాకాలం మాత్రమే పని చేస్తున్నాయి. రెండు పంపులను వాడకంలోకి తీసుకొచ్చారు. ఐదు చేతిపంపులు ఎండిపోయాయి. గ్రామంలో ఏడవ వార్డు పోలీసు క్వార్టర్స్‌ కాలనీకి నెలరోజులైనా నీళ్లు రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వార్డుకు చొక్కనహళ్లి రోడ్డులోని శ్మశాన వాటిక దగ్గర ఉన్న బోరు నుంచి నీరు వచ్చేవి. ఆ బోరు నుంచి ఇటీవల సరఫరా చేయగా పూడు, దుర్వాసనతో నీరు రావడంతో ఆ నీటిని వినియోగించలేకపోయారు. పంచాయతీ అధికారులు, సర్పంచి దృష్టికి తీసుకెళ్లినా ‘చూద్దాం.. చేద్దాం’ అని అంటారే తప్ప తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు ఆర్భాటంగా హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఆస్పరిలో దాదాపు రెండు వేల కుటుంబాలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 7,263 మంది జనాభా నివసిస్తున్నారు. 5,765 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ గ్రామానికి ప్రధానంగా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామం నుంచి ఉమ్మడి రాష్ట్రాల భూగర్భ జలాల శాఖ మాజీ మంత్రి మూలింటి మారెప్ప తెచ్చిన పైపులైన్‌ ద్వారా ఆదోని మండలంలోని ఆరు గ్రామాలు, ఆస్పరి మండలంలోని తొమ్మిది గ్రామాలకు నీళ్లు వస్తున్నాయి. ఆయన నాగనాథనహళ్లి నుంచి తెచ్చిన నీరే ఆస్పరి మండలానికి తాగునీరు.

ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి :సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు
గ్రామంలో నీటి ఎద్దడిని నివారించేందుకు పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి. రాబోయే రెండు నెలలు నీటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సంబంధిత అధికారులు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.

15 రోజులైనా నీరు రావడం లేదు : కొల్లు జయలక్ష్మి, ఆస్పరి గ్రామం.
గ్రామంలో 15 రోజులైనా కుళాయిలకు నీరు రావడం లేదు. గుక్కెడు నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కుళాయిలకు నీరు రాక ఫిల్టర్‌ నీరు బిందె రూ.ఏడులకు కొనుక్కొని తాగుతున్నాం.

➡️