వెబ్‌ సమాచారం ఖతం

Mar 9,2024 10:16 #available, #SBI, #Web information
  • ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పేజీలు, లింక్‌లు కనబడని వైనం
  • వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఎస్‌బిఐ
  • చర్చనీయాంశంగా మారిన తాజా పరిణామం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎలక్టోరల్‌ బాండ్లపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. వీటి ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను మార్చి 6 లోగా పొందుపర్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఎస్‌బిఐని ఇప్పటికే ఆదేశించింది. అయితే, జూన్‌ 30 వరకు గడువును కోరుతూ ఎస్బీఐ.. సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఎస్బీఐ.. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పత్రాలను తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఎస్‌బిఐ చేసిన ఈ పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’, ‘ఫ్రీక్వెంట్లీ ఆస్‌క్డ్‌ క్వశ్చన్స్‌ (ఎఫ్‌ఏక్యూ)’ అనే పేరుతో ఉన్న లింక్‌లు, వెబ్‌పేజ్‌లు ఇప్పుడు ఎస్‌బిఐ వెబ్‌సైట్‌లో కనబడటం లేదు. ‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’ అనే పత్రానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ 2018, జనవరి 2న విడుదలైంది. ఎలక్టోరల్‌ బాండ్‌ను ఎవరు కొనగలరు, ఎంత డినామినేషన్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి, బాండ్‌ల కొనుగోలుకు అవసరమైన పత్రాలు ఏమిటి, ఎలా కొనుగోలు చేయాలి (నెఫ్ట్‌, ఆన్‌లైన్‌ లావాదేవీల, మొదలైనవాటి ద్వారా), బాండ్లను అమ్మే అధీకృత ఎస్‌బిఐ బ్రాంచ్‌లు ఏవి అనేది సమాచారం ఇందులో ఉంటుంది. కేవైసీ అవసరాలు, బాండ్ల కొనుగోలుకు సిటిజెన్‌షిప్‌ ప్రూఫ్‌ వంటి ఇతర వివరాలు ఎఫ్‌ఏక్యూ పేజీలో ఉంటాయి. కాగా, వెబ్‌సైట్‌ నుంచి వీటి తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ నితిన్‌ సేథీ, మరొక సోషల్‌ మీడియా వినియోగదారు ‘ఎక్స్‌’ వేదికగా బహిర్గతపర్చారు.

ఎస్‌బిఐ తాజా విడతలో ఇప్పటి వరకు రూ.16,518.11 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్‌ బాండ్లను అమ్మినట్టు సమాచారం. కాగా, ఒక ఆంగ్ల వార్త సంస్థ కథనం ప్రకారం.. ఎస్‌బిఐ మోడీ ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలకమైన సమాచారమందించింది. అయితే, సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నిలక సంఘానికి అందించటం కోసం ఎస్‌బిఐ మరో నాలుగు నెలల గడువును కోరుతుండటం గమనార్హం. షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ లోపే ఎన్నికలు జరిగే అవకాశముంటుందనీ, ఆ లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం బహిర్గతమైతే అధిక విరాళాలు అందుకున్న బిజెపికి పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బహుశా, ‘బలమైన శక్తుల’ ప్రోద్బలంతోనే ఎస్బీఐ గడువును జూన్‌ 30 వరకు కోరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

➡️