ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం ‘లోకల్’ వారికే ఈ టోకెన్లు ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్‌కార్డులతో టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్‌కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్‌పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్‌పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్‌లు రప్పించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు అంబులెన్స్‌లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం డిఎస్‌పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లోకల్, నాన్‌లోకల్ వారినందరినీ రప్పించడంతో తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం.