మిట్టల్‌ స్టీల్‌కు భూమెక్కడ ?

  • నక్కపల్లిలో ప్రభుత్వం చేతిలో సరిపడా లేని భూమి
  • పూర్తి కాని పరిహారం, పునరావాసం
  • సమస్యలు పరిష్కారం కాకుండానే హడావుడి

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ‘ఆలూలేదు, చూలూలేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రచారం. మిట్టల్‌ ప్రతిపాదిత భూమి ప్రభుత్వం వద్ధ సిద్ధంగా లేనప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ కొద్ది రోజుల్లో వస్తుందన్నట్లు హడావుడి చేస్తోంది. నక్కపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) సేకరించినట్లు చెబుతున్న 4,500 ఎకరాల్లో వేంపాడు, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట, చందనాడ, డిఎల్‌.పురంలోని 2,100 ఎకరాలను బల్క్‌ డ్రగ్‌ పార్కుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. మిగిలిన 2,400 ఎకరాలకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో వెయ్యి ఎకరాలకుపైగా వివాదంలో ఉంది. సేకరించిన భూమికి పరిహారం, తరలించాల్సిన గ్రామాలకు పునరావాసంపై స్పష్టమైన హామీ ఈనాటికీ ఇవ్వకపోవడంతో భూములు జోలికి ప్రభుత్వం వెళ్లలేని స్థితి ఉంది. భూములు కోల్పోయిన మత్స్యకారులు, రైతుల సమస్య ఎంతోకాలంగా నలుగుతున్నా పరిష్కారం చూపకుండా మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మొదట దశలో రూ.70 వేల కోట్ల వ్యయంతో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 21 వేల మందికి ఉపాధి లక్ష్యంతో రాజయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి మిట్టల్‌ స్టీల్‌ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తలూపింది. ఇందుకు కావాల్సిన 2,200 ఎకరాల్లో వెయ్యి ఎకరాలకు మించి ప్రభుత్వం వద్ద ప్రస్తుతం సిద్ధంగా లేదని ఓ అధికారి తెలిపారు. రెండో దశలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుంచి 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల విస్తరణకు మరో 3,500 ఎకరాలకుపైగా ఉండాలి. తొలి, రెండో దశలోల్లో 5,500 ఎకరాలు అవసరం. ప్రభుత్వం చేతిలో తొలిదశకు కూడా సరిపడా భూమి లేదు. రెండో దశకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాకుండానే రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్‌ప్లాంట్‌ రానుందని ప్రభుత్వం ఊదరగొడుతోంది. విశాఖ-చెన్నరు ఇండిస్టియల్‌ కారిడార్‌లో భాగంగా ఎపిఐఐసి చేసిన భూ సేకరణలో తరలిస్తామని ప్రకటించిన బోయపాడు, బుచ్చిరాజుపేట కొత్తూరు, చందనాడలో కర్రివానిపాలెం, తమ్మయ్యపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, డిఎల్‌.పురం వాడపేట ప్రజల పునరావాస సమస్యను తేల్చలేదు. 18 సంవత్సరాలు నిండిన వారికి చెల్లించాల్సిన ప్యాకేజీపై కటాఫ్‌ తేదీని వెల్లడించలేదు. డి పట్టా, సాగు భూములకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదు. నిర్వాసితుల కోసం రెండుసార్లు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో ఒక్క సమస్యా పరిష్కరించలేదు.

➡️