శ్రీశైలం నిరుద్యోగుల కష్టం తీరేదెన్నడు..?

May 19,2024 08:56 #problem, #solve
  • అమలుకు నోచుకోని జిఒ 98
  • ఉద్యోగాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులు
  • రాష్ట్రానికి వెలుగునిచ్చిన వారి జీవితాల్లో చీకట్లు

ప్రజాశక్తి – కొత్తపల్లి : 
రాష్ట్రానికి వెలుగునిచ్చిన వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన వారికి నేటికీ న్యాయం దక్కడం లేదు. నీటి ముంపు నిరుద్యోగుల కోసం తెచ్చిన జిఒ 98 అమలుకు నోచుకోవడం లేదు. నీటి ముంపు నిరుద్యోగులను పాలకపక్షం నేతలు దశాబ్దాలుగా దగా చేస్తూనే ఉన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో 130 గ్రామాలు పైగా ముంపునకు గురయ్యాయి. ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం త్యాగం చేసి శ్రీశైలం ముంపు బాధితులు సమిధలయ్యారు. రాష్ట్రానికే వెలుగులు ప్రసాదించే ఈ జలాశయం కోసం యావదాస్తులను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాల జీవితాలు నాలుగు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ బాగుపడని పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం ప్రభుత్వం, పాలక పక్షం నేతలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే.
ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో దాదాపుగా 44 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. తాత ముత్తాతల కాలం నుంచి ఆహర్నిశలు కష్టపడి సంపాదించిన ఆస్తులను, పచ్చని పంట పొలాలను, ఇళ్లను, కల్లాలను ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తృణత్యాగం చేసి తల్లి లాంటి గ్రామాలను విడిచిపెట్టి చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయారు. దాదాపు 1 లక్షా 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. గమ్యం ఏమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో తెలియని ప్రాంతాలకు వలసలు వెళ్లి అల్లాడిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన కొంత పరిహారం బాధితుల కడగండ్లను తీర్చలేకపోగా రైతులకు అప్పటి ప్రభుత్వం ఆవేదనను మిగిల్చింది.

➡️