సిపిఐ(యం)పై ఎందుకీ అక్కసు ?

Mar 10,2025 01:27 #Andhra Jyothi, #Articles, #CPM AP

”విశ్వసనీయత” వెనుక మతలబు ఏమిటి?

ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆర్‌కె గారి కొత్త పలుకులో ”కూటమికి పట్టం… ఐక్యత ”భద్రం” అనే పేరుతో రాసిన సంపాదక వ్యాసం సిపిఐ(యం)పై ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కింది. గత మూడు మాసాల్లో సిపిఐ(యం)పై ఇలా దుర్మార్గంగా దాడి చేయడం, నిరాధార ఆరోపణలు చేసి ఆంధ్రజ్యోతి పాఠకుల్ని నమ్మించాలని ప్రయత్నించడం వెనుక మతలబు ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ‘కామ్రేడ్స్‌ కష్టాలు’ పేరుతో రాసిన ఈ దాడికి ‘కామ్రేడ్స్‌తో కష్టాలు’ అని పేరు పెట్టివుంటే బాగుండేది. తెలుగుదేశం తొమ్మిది నెలల పాలనా వైఫల్యం ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తగ్గించాలంటే ప్రజల తరపున గట్టిగా నిలబడి పోరాడుతున్న సిపిఐ(యం) ”విశ్వసనీయత”ను దెబ్బతీయకుండా సాధ్యం కాదని రాధాకృష్ణ (ఆర్‌కె) గారు గ్రహించారని స్పష్టంగా అర్థమవుతున్నది. తెలుగుదేశాన్ని కాపాడే క్రమంలో సిపిఐ(యం)పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారు. మంచి కుక్కను కొట్టాలంటే పిచ్చికుక్కగా ముద్ర వేయాలన్న చాణక్య నీతిని ఆయనిక్కడ ప్రదర్శించారు. అందుకే ఉన్నవీ లేనివీ కల్పించి సిపిఐ(యం)పై ఆరోపణలు చేసి దాని విశ్వసనీయతపై దెబ్బకొడితే ప్రజా ఉద్యమాలను అరికట్టవచ్చని, అసంతృప్తిని అదుపు చేయొచ్చని ఆయన భావిస్తున్నారు. రానున్న రోజుల్లో సిపిఐ(యం) ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతమవుతాయని వారి కన్నా ముందే ఈయన పసిగట్టినట్లున్నారు. అందుకే ఈ ముందస్తు దాడి. వైసిపి కోసమే, వారి తరపున రహస్యంగా సిపిఐ(యం) ఈ పని చేస్తున్నదని నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నారు.

రహస్య ఒప్పందం ఎవరిది?
సిపిఐ(యం)పై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆర్‌కె గారు అదే జగన్‌తో తెలుగుదేశం రహస్య ఒడంబడికల్ని మాత్రం కావాలని విస్మరిస్తున్నారు. అదానీ దగ్గర రూ.1750 కోట్లు లంచం తీసుకొని విద్యుత్‌ ఛార్జీలు పెంచి ఒప్పందం చేసుకున్న జగన్‌పై టిడిపి కూటమి ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదు? ఎందుకు కేసు బుక్‌ చేయలేదు? ఇది రహస్య ఒప్పందం కాక మరేమిటి? జగన్‌ చేసుకున్న తప్పుడు విద్యుత్‌ ఒప్పందాల వల్ల లక్ష 80 వేల కోట్ల రూపాయల భారం పెరిగిందని శ్వేతపత్రంలో ఘనంగా పేర్కన్న టిడిపి ప్రభుత్వం వాటిని ఎందుకు రద్దు చేయలేదు? స్మార్ట్‌ మీటర్లు ఉరితాళ్ళని, ధ్వంసం చేయమన్న లోకేష్‌ తమ పాలనలో అవే స్మార్ట్‌ మీటర్లను ఎందుకు బిగిస్తున్నారు? ఇది రహస్య ఒప్పందం కాదా? జగన్‌తో చేతులు కలపడం కాదా? ప్రజలపై దాడి చేయడానికి, భారాలు మోపడానికి జగన్‌ – చంద్రబాబుకు విబేధాల్లేవు. తగాదా అల్లా కుర్చీల కోసమే. అది కూడా నిజమైన పోరాటం కాదు. నిన్నటిదాకా వైసిపిలో పదవులు వెలగబెట్టిన పెద్ద మనుషులు ఇప్పుడు గోడదూకి టిడిపిలోకి రాగానే పవిత్రమైపోతారు. జగన్‌కు చంద్రబాబుకు వీరే వారధులనుకోవాలి కదా ! ఇందులో రాధాకృష్ణ గారికి ఏ విశ్వసనీయత కనిపించింది? తొమ్మిది మాసాల పాలన అనంతరం టిడిపికి వైసిపికి తేడా ఏమిటని టిడిపి శ్రేణులే అడుగుతున్నాయి. అది ఆర్‌కె రచనల్లోనూ వెల్లడవుతుంది.

రాష్ట్రానికి ద్రోహం చేసిన వారు పుణ్యాత్ములా?
ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌కె గారికి రవ్వంత తప్పు కనిపించలేదు. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపి విశాఖ ఉక్కును గాలికొదిలేసి కడప ఉక్కును పట్టించుకోకపోయినా, వాటికి బదులుగా మిట్టల్‌ ఫ్యాక్టరీకోసం నానా అగచాట్లు పడడం సరైందిగా కనిపిస్తుంది. బిజెపికి వైసిపి – టిడిపి ఇద్దరూ మద్దతుదారులే. ఢిల్లీలో మోడీ కుడి ఎడమల మద్దతునిస్తున్న ఈ రెండు పార్టీల వెనకున్న రహస్య అజెండా ఏమిటి? ఈ పార్టీల కూటమి టిడిపి – జనసేన – బిజెపి తెలంగాణాలో సైతం రావాలని కోరుకుంటున్న ఆర్‌కె గారికి ఇందులో విశ్వసనీయత చాలా కనిపిస్తున్నది.

సొంత వైళ్ళు తిరగేయండి సార్‌!
వైసిపి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇసుక, మద్యం విధానాలను వ్యతిరేకించి పోరాడింది సిపిఐ(యం). ఒక్కసారి ఆంధ్రజ్యోతి పాత ఫైళ్ళు తిరగేయాలని రాధాకృష్ణ గారిని కోరుతున్నాను. పోలవరం నిర్వాసితులు, విశాఖ ఉక్కు, కడప ఉక్కు, దళితులపై అత్యాచారాలు, ప్రత్యేక హోదా, ఇలా ప్రతి సమస్యమీదా పోరాడింది సిపిఐ(యం). విద్యార్థి, యువజన, కార్మిక, రైతాంగ పోరాటాల్లోనూ సిపిఐ(యం) చురుగ్గా ఉన్న విషయం ఆంధ్రజ్యోతి పాత ఫైళ్ళు (జిల్లా ఎడిషన్లు సహా. ఎందుకంటే వైసిపికి వ్యతిరేకంగా సిపిఐ(యం) పోరాటాలకు నాడు కూడా ఈ పత్రిక ప్రాచుర్యం కల్పించలేదు. అదీ వైసిపిపై వీరి ప్రేమ.
నాడు పోరాటాలు చేసి టీచర్స్‌, అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్‌, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల టిడిపి తీసుకున్న వైఖరి ఏమిటి? గిట్టుబాటు ధరలూ, పెన్షన్ల కోసం ఒక్క ఆందోళనైనా చేసిందా టిడిపి? దాన్ని గురించి ఆర్‌కె ఎందుకు ప్రస్తావించరు? జి.వో.నెం.3కి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? విద్యుత్‌ చార్జీల పెంపుదలను వ్యతిరేకించింది ఎవరు? పౌర హక్కుల్ని హరిస్తున్న జి.వో.కు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? భూటైటిలింగ్‌ యాక్టుకు నాడు గట్టిగా వ్యతిరేకించింది సిపిఐ(యం). టిడిపి కాదు. నాడు హైకోర్టులో కేసులకు, ప్రెస్‌కాన్ఫరెన్సు, టివి డిబేట్లకే పరిమితమైన టిడిపి చేసిందా? వైసిపి ప్రభుత్వం అంగన్‌వాడీలను బెదిరించి, నిర్బంధిస్తే, టీచర్లపై జులుం ప్రదర్శిస్తే ఆనాడు టిడిపి ఎక్కడుంది? కనీసం ఖండించిందా? నాడు సిపిఐ(ఎం)పై వైసిపి దాడి చేయగా ఆ పని నేడు టిడిపి చేస్తున్నది. అదే తేడా! నాడు విద్యుత్‌ ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా పయ్యావుల కేశవ్‌, చంద్రమోహన్‌రెడ్డి కేసులు వేశారా? వారు వేసిన కేసులకు వ్యతిరేకంగానే వారు నేడు నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నారు. ఇది జగన్‌తో కుమ్మక్కు అవడం కాదా? దాన్ని ఆర్‌కె గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? దిగజారుడు విమర్శలతో, ఆర్‌కె గారి విశ్వసనీయత ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము.
ఇక సిపిఐ(యం) గతకాలపు నిజాయితీ, నిక్కచ్చి, విశ్వసనీయత గురించి, రాధాకృష్ణ గారు రాస్తూ అవి ఇప్పుడు లేవని, నాయకత్వం జగన్‌తో ”రహస్య ఒప్పందాలు” చేసుకుందని నిరాధార ఆరోపణ చేశారు. ఆయన వద్ద ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే బయటపెడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. తాను ఒక జర్నలిస్టునన్న విషయం మరిచిపోయి అనైతికంగా, రాజకీయ నాయకుడిలా సిపిఐ(యం)పై ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేయడంలో ”విశ్వసనీయత” ఎంతో ఆలోచించుకుంటే మంచిది. ఇలాగే సిపిఐ(యం)పై దిగజారి ఆరోపణలు చేసుకుంటూ పోతే వారి విశ్వసనీయతకే ముప్పు వస్తుందని గ్రహించాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపుతో వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని ఉబ్బితబ్బిబై పోతున్నారు. పిడిఎఫ్‌పై గెలవడానికి టిడిపి అనేక అక్రమ పద్ధతులు అనుసరించింది. రాధాకృష్ణగారికి ఈ విషయం తెలుసుకొని విస్మరించినట్లు నటిస్తున్నారు. పిడిఎఫ్‌పై గెలిచి టిడిపి చేసుకుంటున్న సంబరాలు చూస్తుంటే ఎంత భయపడ్డారో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. టిడిపి శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ఏమిటీ అల్ప సంతోషమని ముక్కున వేలేసుకుంటున్నారు. రాధాకృష్ణగారికి మాత్రం ఇది వెయ్యేనుగుల బలం ఇచ్చింది. టీచర్‌, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ(యం) ఏనాడూ పోటీ చేయలేదు. అభ్యుదయ విద్యావంతులు, ఉద్యమాల నాయకులు పిడిఎఫ్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల నుండి వైసిపి, టిడిపిలు రంగంలో దిగి వాటిని రాజకీయ రణంగా మార్చాయి. దానివల్ల నష్టపోతున్నది టీచర్లు, విద్యావంతులైన నిరుద్యోగులు, ఉద్యోగవర్గాలే. వారిలో పాలకపార్టీపై – అది వైసిపి అయినా, టిడిపి అయినా – విశ్వసీనీయత తగ్గిపోతున్నది. ఈ ఆగ్రహాన్ని దారి తప్పించడానికే రాధాకృష్ణగారు కలం బాణాన్ని వదిలారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2023లో జరిగిన రాయలసీమ తూర్పు, పశ్చిమ ఎన్నికల్లో వైసిపి దెబ్బకు తట్టుకోలేక టిడిపి చేతులెత్తేస్తే ఎదుర్కొని గట్టిగా నిలబడింది సిపిఎం అన్న విషయం టిడిపి నాయకులకు కూడా తెలుసు. నాడు పోలింగ్‌ బూత్‌ల వద్ద వైసిపి దుర్మార్గాలను ఎదుర్కొని నిలబడింది సిపిఐ(యం) పార్టీయేనన్నది జగమెరిగిన వాస్తవం. అప్పుడు సిపిఐ(యం) విశ్వసనీయత రాధాకృష్ణ గారికి గుర్తురాలేదు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో టిడిపి ప్రజలకోసం చేసిన ఉద్యమాలేమిటి? వారిపై పెట్టిన కేసులెన్ని? రాధాకృష్ణగారు లెక్కలు సేకరించాలి. ఈ కాలంలో సిపిఐ(యం) నిర్వహించిన ఉద్యమాలు, కేసుల గురించి వారు చెప్తారు. గురివింద గింజ సామెతలాగా జగన్‌ దెబ్బకు భయపడి, కేసులస్తాయని లంగిపోయిన వాళ్ళు ఇప్పుడు అధికారం రాగానే వీరత్వం ప్రదర్శిస్తున్నారు. రాధాకృష్ణగారి బాధ నాడు సిపిఐ(యం) పోరాటాలు చేయనందుకు కాదు. ఇప్పుడు చేస్తున్నందుకు. అసలు విషయం దాచిపెట్టి నిందారోపణలకు దిగుతున్నారు. ఇదేనా మీ నిజాయితీ? సిపిఐ(యం) ఏనాడూ వైసిపితో సీట్లు సర్దుబాటుకోసం తహతహలాడలేదు. కనీసం ఆలోచించనూ కూడా లేదు. వైసిపికి వ్యతిరేకంగా టిడిపితో కలవనందుకే ఆర్‌కె గారికి బాధగా ఉంది. సిపిఐ(యం) ఇద్దరితోనూ కలవలేదు. కారణం బిజెపితో టిడిపికున్న స్నేహం. అది రాజకీయ విధానంపై ఆధారపడిన నిర్ణయం. టిడిపి బిజెపితో సర్దుబాటు చేసుకున్నందున సిపిఐ, కాంగ్రెస్‌ సిపిఐ(యం)తో సర్దుబాటుకు ముందుకొచ్చింది. ఇండియా బ్లాకు పార్టీలతో సర్దుబాటు చేసుకోవాలని సిపిఐ(యం) మొదటి నుండి ప్రయత్నించింది. సిపిఐ, సిపిఐ(యం) ఉమ్మడి అవగాహనతో పోవడం ఆర్‌కె గారికి ఇష్టం లేదని అర్థమవుతున్నది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి సిపిఐ(యం)ను నిందించడం తగునా రాధాకృష్ణగారు?

– ప్రజా మిత్ర

➡️