భీమసింగిని తెరిపిస్తారా..?

Jun 8,2024 08:49

ప్రజాశక్తి – జామి : భీమసింగి సహకార చక్కెర కర్మాగారం ప్రభుత్వ విధానాల ఫలితంగా మూతపడింది. ప్రధానంగా వైసిపి ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించడం పట్ల చిత్తశుద్ధి చూపకపోగా, నెపాన్ని రైతులపైకి నెట్టింది. చెరకు సాగు సరిపడా లేకపోవడం వల్లే ఫ్యాక్టరీ నడవడం లేదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని తెరిపించాలని చేపట్టిన పోరాటంపైనా వైసిపి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడం, ఈ ప్రాంత రైతులు, కార్మికులు, ప్రజల నుంచి వైసిపి తీవ్ర అగ్రహాన్ని చవిచూసింది. తాజాగా జిల్లాలో ఏడుకు ఏడు స్థానాల్లో వైసిపిని ఓడించి, కూటమికి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇకనైనా భీమసింగికి మంచి రోజులు వస్తాయని రైతులు ఆకాంక్షిస్తున్నారు.భీమసింగి చక్కెర ఫ్యాక్టరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. రైతులు వాటా ధనాలతో నిర్మించుకున్న ఈ ఫ్యాక్టరీ మూసేయడం అంటే చరిత్రను చెరిపేయడమే. మరోవైపు ఏళ్లుగా ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్న కార్మికులు, ఉద్యోగులను రోడ్డు పడేయడమే. సహకార రంగాన్ని బలోపేతం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన వైసిపి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లపాటు కమిటీల పేరుతోనే కాలయాపన చేసి, చివరికి ఫ్యాక్టరీని మూసేసింది. దీనిపై చెరకు రైతులు, కార్మికులు, ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా. పట్టించుకోలేదు. గతంలో చంద్రబాబు అభివృద్ధి చేస్తామని చెప్పి, నిపుణుల కమిటీని వేసి, చేతులు దులుపుకున్నారు. చివరికి ప్రభుత్వం ఆ కమిటీ నివేదిక మాత్రం బహిర్గతం కాలేదు. మరోసారి ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈసారైనా సహకార చక్కెర ఫ్యాక్టరీలపై టిడిపి సానుకూల రీతిలో తెరిపించే చర్యలు చేపడుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఆ దిశగా దృష్టిసారిస్తే..వాస్తవానికి సహకార ఫ్యాక్టరీలన్నీ 70 శాతం క్రషింగులు కుప్పకూలిపోయాయి. జిల్లాలో భీమసింగి సహకార ఫ్యాక్టరీ ఒకప్పుడు 1.60 లక్షల టన్నులు క్రషింగ్‌ చేయగా, ప్రస్తుతం 30 వేల టన్నులు కూడా లభ్యం కాదని అధికారులు సెలవిస్తున్నారు. ఆధునికీకరణ చేస్తామన్న పేరుతో క్రషింగ్‌ను ఆపేసిన వైసిపి ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీని మూసేసింది. సహకార ఫ్యాక్టరీలను బాగు చేసేందుకు అనేక అవకాశాలున్నాయి. ప్రధానంగా సహకార ఫ్యాక్టరీలన్నీ పురాతనమైనవి కావడంతో ముందుగా యంత్రాలను ఆధునికీకరించాలి. తక్షణమే క్రషింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా బయో ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లు నెలకొల్పడం సాధ్యమవుతుంది. దీనికి సుమారుగా రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు అవసరం ఉంటుందని గతంలో అంచనా. ఈ మూడింటిపై దృష్టి సారిస్తేనే మనుగడ సాధ్యం. అప్పుడే రైతులకు మేలువ్యవసాయమే లాభసాటి కోల్పోతున్న నేపథ్యంలో ఏడాదికి గుత్తగా ఆదాయాన్ని సమకూర్చే చెరకు పంట బతకాలంటే, సహకార ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కొత్తగా కొలువు తీరబోయే మంత్రులతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీని నిలబెట్టేందుకు దృష్టిసారించాలి. అప్పుడే ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరుగుతుంది. ఆ దిశగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

➡️