‘ల్యాండ్‌ టైట్లింగ్‌’ రద్దు అవుతుందా?

Jun 9,2024 10:42 #ap government, #land title act
  • కేంద్రంతో ముడిపడి ఉందంటున్న అధికారులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దు విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టిడిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రకటన ఎప్పుడు ఆచరణలోకి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు రూపొందించిన చట్టం కావడంతో రద్దు వ్యవహారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉందని అధికారులు అంటున్నారు. ఈ చట్టానికి – ఆర్థిక సంస్కరణలకు, సంస్కరణలకు – నిధులకు ముడిపడి ఉండటం టిడిపి వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధుల రూపంలో సహకారం కావాల్సిఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిధులు రావడానికి అవకాశం ఉన్న ఏ ఒక్క మార్గాన్ని కూడా వదులుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు విషయంలో ప్రజలకు హామీ ఇచ్చి ఉండడటంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఒప్పించడమే మార్గమని అంటున్నారు. అయితే, ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో పట్టుదలగా వ్యవహరించింది. మారిన పరిస్థితుల్లో ఎలా స్పందిస్తుందో చూడాల్సిఉంది.

గతంలో ఏం జరిగింది?
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును అసెంబ్లీలో పెట్టే సమయంలోనే ప్రధాని ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు తాము ప్రవేశపెడుతున్నామని గత ప్రభుత్వం పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించిన తరువాత కేంద్రానికి పంపించారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి మరలా చట్టం చేయాలని సూచించారు. దీనిపై రెండోసారి అసెంబ్లీలో బిల్లుపెట్టి ఆమోదించి నీతి ఆయోగ్‌కు పంపించారు. వెంటనే అక్కడ కూడా ఆమోదం రావడంతో రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, ఈ చట్టం అధికారుల ఇష్టాఇష్టాల మేరకు నడుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్‌ కౌన్సిళ్లలోనూ ఈ చట్టానికి వ్యతిరేకంగా నెలరోజులపాటు నిరసన దీక్షా శిబిరాలు నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే నేరుగా హైకోర్టులో పిటీషన్‌ వేసుకోవాలని పెట్టిన నిబంధన వల్ల సాధారణ ప్రజలకు న్యాయం అందని ద్రాక్షగా మారుతుందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రకారం . భూములపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వెంటనే దాన్ని డిస్ప్యూట్‌ రిజిస్టర్లో నమోదు చేస్తారు. దీనిపై నిర్దేశించిన అధికారికి దరఖాస్తు చేసుకోవాలి, ఆయన అంగీకరిస్తే సరి లేకపోతే ఇక దాన్ని విడిపించుకోవాలంటే హైకోర్టుకు వెళ్లాలి. దీనివల్ల భూములపై ప్రజలు హక్కులు కోల్పోతారని, పేదల నుండి భూములు లాక్కోవడం తేలికవుతుందనీ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు.

➡️