బందర్‌ పోర్టు నిర్మాణంలో వేగం పెరిగేనా ?

Jun 10,2024 08:32
  • ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభావం
  • ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోనుందో?

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా పారిశ్రామికావృద్ధికి దోహదపడే బందరు పోర్టు నిర్మాణ పనులపై ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభావం పడుతోంది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగిన ఈ పోర్టు నిర్మాణం నేటికీ పూర్తవ్వలేదు. నూతనంగా అధికారం చేపట్టనున్న కూటమి ప్రభుత్వం పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. తొలిదశలో బందరు పోర్టులో నాలుగు బెర్త్‌ల నిర్మాణ పనులు 2023 మేలో ప్రారంభమయ్యాయి. మెఘా ఇంజనీరింగ్‌ సంస్ధ రూ.3,669 కోట్లకు కోడ్‌ చేసి కాంట్రాక్టు పనులను దక్కించుకుంది. 13 నెలల కాలంలో రూ.850 కోట్ల పనులను పూర్తి చేసింది. ఇందుకుగానూ కాంట్రాక్టు సంస్థకు రూ.571.56 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొదటి దశ పోర్టు నిర్మాణ పనులు 2025 అక్టోబర్‌కు పూర్తవ్వాల్సి ఉంది. అంటే, సగటున నెలకు రూ.152 కోట్లు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత నెలకు సగటున రూ.65 కోట్లు పనులు జరుగుతున్నాయి. 2008లో పోర్టు కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మైటాస్‌ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో, పోర్టు పనులు ప్రారంభం కాలేదు. 2019 ఫిబ్రవరి 7నలో పోర్టు నిర్మాణ పనులను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతి (బిఒటి)లో పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో టిడిపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ పోర్టు నిర్మాణ ప్రాంతానికి భారీ యంత్రాలను తరలించింది. తర్వాత అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణ పనులను నిలిపివేసింది. నవయుగతో ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య కోర్టు వ్యాజ్యాలు నడిచాయి. మూడున్నర ఏళ్లు గడిచిపోయాయి. కోర్టు తీర్పు అనంతరం ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (ఇపిసి) పద్ధతిలో ప్రభుత్వమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పూర్తయ్యాక పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణం మంజూరు చేసింది. మెఘా ఇంజనీరింగ్‌ సంస్ధ కాంట్రాక్టు దక్కించుకుంది. తాజాగా మరోసారి ప్రభుత్వం మారింది. నూతన ప్రభుత్వం ఈ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే పోర్టు సకాలంలో పూర్తవుతుంది. కొత్తగా ఏర్పాటు కానున్న కూటమి ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై పోర్టు నిర్మాణం ఆధారపడి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

➡️