విద్యాకానుక కిట్ల లెక్కలు తేలుస్తారా?

  • మిగులును పట్టించుకోకుండా భారీ కొనుగోళ్లు
  • కోట్లాది రూపాయల అవినీతి?

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు అందిస్తున్న విద్యాకానుక కిట్లపై విద్యాశాఖ అధికారులు లెక్కలు తేలుస్తారో? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. జగనన్న విద్యాకానుక(జెవికె) పేరుతో గత ప్రభుత్వం ప్రతి ఏటావిద్యార్ధుల సంఖ్య కంటే అదనంగా కొనుగోలు చేసింది. దీనిపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ వచ్చే విద్యాసంవత్సరంలో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ మరుసటి సంవత్సరం కూడా ఇదే తంతు చోటుచేసుకుంటోంది. ఫలితంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రతి ఏటా మిగులుతున్న లక్షలాది కిట్లు ఏమవుతాయో తెలియని స్థితి నెలకొంది. 2022-23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్ధుల సంఖ్య 39,96,064 మంది. అయితే ‘సమగ్రశిక్ష అభియాన్‌ ‘45,60,041 కిట్లను కొనుగోలు చేసింది. వీటిలో 5,63,977 కిటు మిగిలాయి. ఒక్కో కిట్టును సుమారు రూ.1900లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన వాటి విలువ రూ.107.20కోట్లు. వీటిని పట్టించుకోకుండా 2023-24 విద్యాసంవత్సరానికి 39,96,064 కిట్లను మళ్లీ కొనుగోలు చేశారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 38.22లక్షలు చేరారని పాఠశాల విద్యాశాఖ తొలుత ప్రకటించింది. తుది లెక్క 36,54,539 గా తేలింది. అంటే 3,41,525 లక్షల కిట్లు మిగిలాయి. ఒక్కొ కిట్టును రూ.2006లతో కొనుగోలు చేశారు.జ వీటి విలువ రూ.68.50 కోట్లు. ఈ మిగులిన వాటిని పట్టించుకోకుండా ప్రస్తుత విద్యాసంవత్సరం(2024-25)లోనూ 36.50లక్షల కిట్లకు మళ్లీ ఆర్డర్‌ పెట్టారు. తేడాది ఎన్‌రోల్‌మెంట్‌ ఆధారంగా ఒక్కొ కిట్టును రూ.2006లతో కొనుగోలు చేసింది. 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో మొత్తంగా 9,05,502 కిట్లు మిగిలాయి. వీటి విలువ సుమారు రూ.175కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇంత ఖర్చుతో కొనుగోలు చేస్తున్నా విద్యార్ధులకు అందించే బ్యాగ్‌, బూట్లలో నాణ్యత ఉండటం లేదు. 2022-23లో మిగిలిన కొన్ని వస్తువులను 2023-24 విద్యాసంవత్సరంలో ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. 2022-23లో మిగులు యూనిఫాం క్లాత్‌ను కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ విద్యార్ధులకు అందించిన్నట్లు చూపిస్తోంది. వాస్తవంగా క్షేత్రస్థాయిలో కొన్ని పాఠశాలలకే నాలుగో జత అందించడం జరిగింది. ఈ మిగులు లెక్కలపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపిస్తుందో? లేదో చూడాల్సి ఉంది.

➡️