- పనులు ప్రారంభం కాకముందే భారీగా పెరుగుదల
- గత ఏడాది కన్నా రెట్టింపయిన వైనం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :రాజధాని అమరావతి గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని గ్రామాల్లో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 70 నుంచి 80 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో, రాజధాని గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ముందే ఊహించిన కొంతమంది రియల్టర్లు ఆరు నెలల క్రితమే ఈ ప్రాంతంలో భూములు కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. గత నెల జూన్ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు మరింత పెరిగాయి. మెట్ట ప్రాంతంలో గతేడాది భూమి ధర గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు ఉండగా, ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది. జరీబు (మాగాణి) గ్రామాల్లో గతేడాది గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. గత వారం రోజుల్లో గజం రూ.52 వేల నుంచి రూ.56 వేల మధ్య రిజిస్ట్రేషన్లు జరిగాయి. తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరగా, ఈ నెలలో గడిచిన పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏప్రిల్‌లో 190, మేలో 221 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాజధాని గ్రామాల్లో 2015లో అప్పటి టిడిపి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాలను తీసుకుంది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. మూడేళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొంది. 2018లో ప్లాట్లు కేటాయించినా అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యేలోగా రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చింది. పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
ఆ తరువాత 2019 డిసెంబరు 17న అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, అమరావతిలో సంక్షోభం ఏర్పడింది. భూముల క్రయవిక్రయాలు మందగించాయి. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్లీ అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు డొమెస్టిక్ ల్యాండ్, 200 గజాలు కమర్షియల్ ల్యాండ్, ఎకరా జరీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు డొమెస్టిక్ ల్యాండ్, 250 గజాలు కమర్షియల్ ల్యాండ్ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. మొత్తంగా గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకొంది.