- వరుస నిరసనలు
- డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టిన కార్మికులు
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం అథిస్తాన్ (బ్రాండిక్స్) కంపెనీలో మహిళాగ్రహం పెల్లుబిక్కింది. పని ప్రదేశంలో ఏళ్ల తరబడి భరించుకుంటూ వచ్చిన అనేక సమస్యలపై మహిళా కార్మికులు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి ఒకటి నుంచి పని సమయం అరగంట పెంచడానికి యాజమాన్యం సిద్ధపడ్డంతో జనవరి 30వ తేదీన బ్రాండిక్స్-2 యూనిట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెకు సిఐటియు అండగా నిలబడ్డంతో మరింత ఆత్మస్థైర్యంతో ఆందోళనను కొనసాగించారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు నిరసనను కొనసాగించారు. ఆదివారం సెలవు ఇస్తున్నట్లు, అరగంట పెంపు సమయం యాజమాన్యం రద్దు చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇఎస్‌ఐ, పిఎఫ్, రవాణా ఛార్జీలు పోనూ రూ.15వేలు వేతనం చెల్లించాలని, సీనియార్టీ ఆధారంగా వేతనాలు పెంచాలని, మహిళా సూపర్‌వైజర్లను నియమించాలని, వేధింపులు అరికట్టాలని, సెలవు రోజున రూ.500 కోత పెట్టొద్దన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మహిళలు పట్టుబట్టారు.
నిరసనలో పాల్గొన్న వేలాది మహిళలకు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి విధులకు పంపాలని సూపర్‌వైజర్లు, యాజమాన్య ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అనివార్యంగా వేతనాలు పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి యాజమాన్య ప్రతినిధులు హామీ ఇవ్వక తప్పలేదు. బ్రాండిక్స్-2 యూనిట్ మహిళల వలె తమకు కూడా జీతాలతో ఇతర సమస్యలను పరిష్కరించాలని బ్రాండిక్స్ 1,3 యూనిట్లలోని మహిళలు ఫిబ్రవరి 1న విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (బిఐఎసి)లోని వివిధ యూనిట్లలో పనిచేస్తున్న సుమారు 22వేల మంది మహిళలకు రూ. ఎనిమిది వేల నుంచి రూ.పదివేల మధ్య జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో ఎనిమిది గంటలకు 1200 ఉన్న పీసుల తయారీ లక్ష్యం క్రమంగా బ్రాండిక్స్ యాజమాన్యం 2,400కు పెంచడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు మహిళా కార్మికులు ప్రజాశక్తికి తెలిపారు. అనేకసార్లు వేతనాలు పెంచాలని చేసిన విజ్ఞప్తులను యాజమాన్యం పట్టించుకోకపోవడం, సమస్యలు క్రమంగా పెరగడం, వేధింపులు భరించలేకపోవడంతో వేలాదిమంది మహిళా కార్మికులు నిరసనకు దిగారు. మహిళల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోంది. మహిళల సమ్మెకు మద్దతు తెలపడానికి వెళ్లిన సిఐటియు నాయకులను అరెస్టు చేసి యాజమాన్యాన్ని వెనుకేసుకొస్తుంది.
వేతనాలు పెంచాలి : ఆర్.రాము, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
బ్రాండిక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు కటింగ్‌లు పోనూ వేతనం రూ.15వేలు చెల్లించాలి. మహిళా సూపర్‌వైజర్లను నియమించాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఇవ్వాలి. మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవచూపకపోతే పోరాటం ఉధృతం చేస్తాం.