Vision 2047: ప్రభుత్వ పాలసీల్లో ‘ప్రపంచబ్యాంకు’

పెట్టుబడులు, కార్పొరేట్లకు అడ్డు లేకుండా లైన్‌ క్లియర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనలో అన్నిటిలోనూ ప్రపంచబ్యాంకు విధానాలు గోచరిస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్‌ 2047, వివిధ రంగాలపై తీసుకొచ్చిన సుమారు 22 పాలసీల్లో గతంలో ప్రపంచబ్యాంకు ఏదైతే చెప్పిందో వాటిని మళ్లీ వేర్వేరు రూపాల్లో తిరిగి తెస్తోంది. ప్రభుత్వ రంగాన్ని, ఉద్యోగులను కుదించడం, సంక్షేమాన్ని వదిలేసి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడం ఇలాంటి వాటిని కొత్తగా పాలసీలు, విజన్‌ పేరుతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రెగ్యులేటరీ కమిషన్లు, ప్రైవేటీకరణకు వీలుగా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విద్యుత్‌, నీటిని వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని సవరించడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడం, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం, విదేశీ వ్యాపార సంస్థలకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేయడం వంటి అంశాలున్నాయి. మరీ ముఖ్యంగా వ్యవసాయ భూములను పారిశ్రామిక ప్రాంతాలుగా మార్చడం, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు పెంచడం, ప్రకృతి వ్యవసాయం పేరుతో ఆహార ఉత్పత్తులను తగ్గించడం(శ్రీలంక గతపాలసీ) ఇవన్నీ కూడా దండలో దారంలా ఒకదానికొకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.
కొత్తగా తీసుకొచ్చే పాలసీల్లో లక్షల మందికి ఉపాధి కల్పన ఉంటుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఉత్పాదకతలో సాంకేతికతను పెంచాలని ప్రతిపాదించారు. ఆధునీకరణ పేరిట ఇప్పటికే ఉన్న ఉపాధి పోతుంటే కొత్త ఉపాధి వస్తుందని మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. వ్యవసాయంలో యాంత్రీకరణ, పారిశ్రామిక ఆధునీకరణ ఇందులో భాగమే. 2000 సంవత్సరంలో చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా ఉద్యోగాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవాలని చూసింది. ఇప్పుడు ఇదే పద్ధతిని అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఇండిస్టియల్‌ పార్కులు తెచ్చి రైతులు నేరుగా వారికి భూములు అప్పగించొచ్చనీ ప్రకటించడమే కాకుండా రాయితీలూ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. గతంలో తీసుకొచ్చిన సరళీకరణ విధానాల్లో పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా భూములు కేటాయింపులు జరపాలనేది కీలకమైన షరతు. దీన్ని ఇప్పుడు పాలసీ రూపంలో ముందుకు తీసుకొచ్చారు.
రాష్ట్రంలో వందకోట్ల పైబడి విలువైన కంపెనీలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2800కిపైగా ఉన్నాయి. ఒకవైపు కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ ప్రజలకు సహజ ఆదాయవనరుగా ఉన్న భూమిని మాత్రం ఎవరి చేతి నుండి వారే నేరుగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. 2013 భూసేకరణ చట్టానికి రాష్ట్రంలో 2018లో సవరణలు తీసుకొచ్చారు. అంతకుముందే 2009లో ల్యాండ్‌ రిఫార్మ్స్‌ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవి చాలదన్నట్లు ఇటీవల నెగోషియబుల్‌ పాలసీ తీసుకొచ్చారు. ఇంకొంచం ముందుకెళ్లి రీసెటిల్‌మెంట్‌ పాలసీని పరిచయం చేస్తున్నారు. ఈ మొత్తం పాలసీలన్నిటిలోనూ భూములను అడిగిన వారికి కోరుకున్నతంత కట్టబెట్టడమే ప్రధానంగా ఉంది.
పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ప్లాంట్లను కూడా ప్రైవేటు భూముల్లోనే ఏర్పాటు చేసేందుకు మరో పాలసీ తీసుకొచ్చారు. దీనికి గ్రీన్‌ ఎనర్జీ అని పేరు పెట్టారు. పెద్దఎత్తున విద్యుత్‌ ఉత్పత్తి పెరిగిందని, ఆదా చేస్తున్నామని చెబుతూనే బయట మార్కెట్‌ నుండి అదనపు ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై ట్రూఅప్‌, ఎఫ్‌పిపిఎస్‌ఏ పేరుతో వేస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో విద్యుత్‌ ప్లాంట్లకు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల ఎకరాలు కట్టబెట్టారు. వాటిని తీసుకున్న వారు మాత్రం తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు.
ఇక నీటి అవసరాలు తీర్చే పేరుతో తొలిసారిగా జలవనరుల ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించినట్లు వాటర్‌ పాలసీలో పేర్కొన్నారు. నీటి రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు విద్యుత్‌లాగే ఇక నీటికి కూడా వినియోగ ఖర్చు ప్రాతిపదికగా డబ్బు వసూలు చేస్తారు. చంద్రబాబునాయుడు తొలిసారి సంస్కరణలు అమలు చేసిన సమయంలో విద్యుత్‌తోపాటు నీటిని కూడా వినియోగ వస్తువుగా మార్చాలనేది కీలకాంశంగా పేర్కొన్నారు. 2008లోనే అన్ని పట్టణ ప్రాంతాల్లో మీటర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని తీర్మానాలు చేయించారు. దాని ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో నీటి మీటర్లు బిగించారు. వీటి నిర్వహణ పేరుతో రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేసి నీటి వ్యాపారాన్ని స్థిరీకరించనున్నారు. అంటే ప్రైవేటు వ్యక్తులు కట్టే ప్రాజెక్టులు రైతుల కోసమా వ్యాపారం కోసమా అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పేరుతో నీటిని తక్కువగా వినియోగించే హార్టికల్చర్‌ సాగును ప్రోత్సహించాలని మరో పాలసీని తీసుకొచ్చారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులు అమలు చేసిన శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది అందులో కీలక షరతు. అలాగే ఆహార ఉత్పత్తులు తగ్గించి ప్రాసెసింగ్‌కు అవసరమైన పంటలు పండించడం షరతుల్లో కీలకమైంది. ఇప్పుడు ఈ షరతునే పాలసీ రూపంలో ముందుకు తీసుకొచ్చారు. దీనివల్ల ఆహార ఉత్పత్తులు తగ్గి ఆహార సంక్షోభం ఏర్పడటం, అది ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం అర్జెంటైనాతోపాటు అనేక దేశాల్లో ఎదుర్కొన్న ప్రధాన సమస్య. 2017లో తీసుకొచ్చిన ఆధునిక యాంత్రీకరణ విధానం కూడా ప్రపంచబ్యాంకు షరతుల్లో భాగమే. చిన్న కమతాలను తగ్గించి కార్పొరేట్‌ వ్యవసాయం చేయడం కోసం ఈ షరతును బలవంతంగా రుద్దింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న ఈ పద్ధతి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అదీ చిన్న కమతాలున్న చోట సాధ్యం కాదు. చిన్న కమతాలను తగ్గించడమంటే రైతులను, వాటిపై ఆధారపడి బతుకుతున్న వారికీ ఉపాధి లేకుండా చేసి బయటకు తరిమి వేయడమే !
ఇంటికొక్కరు ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని కొత్త పల్లవి. ఒకవైపు పెద్దపెద్ద కంపెనీలతో ఉపాధి వస్తుందని చెబుతూనే మరోవైపు ఎవరికివారే ఎంటర్‌ప్రెన్యూర్‌ అనడం అర్థం కాని విషయంగా మారింది. భవిష్యత్‌లో ఉద్యోగాలు ఎవరికివారే చూసుకోవాలనే విధంగా చెబుతున్నారు. 2006లో కేంద్రం ప్రపంచబ్యాంకు నిధులతో తీసుకొచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌(జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం) పథకం అప్పట్లో నిధులిచ్చే సమయంలో అర్బన్‌ రిఫార్మ్స్‌(పట్టణ సంస్కరణలు) తీసుకొచ్చింది. దీనిలో కీలకమైంది. ప్రతిపనికీ యూజర్‌ఛార్జీ వసూలు చేయడం, ప్రతిసేవకూ లెక్కగట్టి ఛార్జీలు వసూలు చేయడం. అందులో భాగంగానే యూజర్‌ ఛార్జీలు, ఆస్తివిలువ ఆధారిత పన్నులు, వీధిలైట్ల నిర్వహణ ప్రైవేటీకరణ, శానిటేషన్‌ ఖర్చులు వసూలు చేయడం, తాగునీటికి ఛార్జీలు, డిఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్సులు పెంచడం, కాలనీ అసోసియేషన్లు ఇవన్నీ కూడా సంస్కరణల్లో భాగమే వాటినే ఇప్పుడు కొత్తగా అమలుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యతల నుండి తప్పుకుని ప్రజలే పాలించుకుని, వారే పన్నులు విధించుకుని వారే నిర్వహించుకునే విధంగా షరతులు పెట్టింది. వాటిని ఇప్పుడు అన్ని పాలసీల్లో అమలు చేస్తున్నారు.
మారిటైం పాలసీ పేరుతో సముద్రతీరం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పోర్టులు, తీర ప్రాంత రోడ్లు అదానీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇక మారిటైం పాలసీ అమలు చేస్తే రాష్ట్రానికి మిగిలేదేమీ లేకపోగా పోర్టులు తీసుకున్నవారి వస్తువులు రవాణా చేసేందుకు సదుపాయాలకు అవసరమైన రాయితీలు కల్పించేందుకు మాత్రమే ఆ పాలసీ ఉపయోగపడే విధంగా ఉంది. లాజిస్టిక్స్‌ పార్కులు కూడా వీటికి అనుబంధంగానే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేసేదేమీ కనిపించకపోగా పాలసీల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేయడం, ఉన్న వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది సుష్పష్టంగా కనిపిస్తోంది.

  • వి సురేష్‌
➡️