Sep 22,2022 07:12
  • ఆవిరితో ఉడికే పదార్థాల్లో పోషకాలుంటాయి. అందుకే అనారోగ్యానికి గురైన వారికి, పసిపిల్లలకు మొదట పెట్టేది ఇడ్లీలే. మరి ఆవి ఎప్పుడూ ఒకే విధంగా చేసుకుంటూ ఉంటే తినాలన్న ఆసక్తి కలగదు. అందుకే రకరకాల పద్ధతుల్లో వండుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది.
  • జొన్నఇడ్లీ

కావలసిన పదార్థాలు : మినపప్పు- ఒక కప్పు, జొన్న రవ్వ-రెండు కప్పులు, ఉప్పు తగినంత. ముందుగా మినపప్పు జొన్న రవ్వను విడివిడిగా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నీళ్లు లేకుండా జొన్న రవ్వను, ఉప్పు వేసుకుని కలపాలి. దీన్ని మరో ఆరు గంటలు పులియ బెట్టుకోవాలి. ఒకేసారి జొన్న రవ్వ ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోతే.. ఒక కప్పు ఇడ్లీ రవ్వ, ఒక కప్పు జొన్న రవ్వతో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు.
తయారీ : పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకుని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సాధారణ ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకుంటారో.. ఇది కూడా అంతే. ఒక్కసారి జొన్న ఇడ్లీనీ అల్లం పచ్చడి, పుదీనా పచ్చడితో తినొచ్చు. లేదా నేతి కారంపొడితో తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు.
ప్రయోజనం : జొన్నల్లో మన శరీరానికి కావలసిన విటమిన్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌, క్యాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మధుమేహంతో బాధపడే వారు ప్రతిరోజు ఈ ఇడ్లీలు తింటే త్వరగా డయాబెటిస్‌ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జొన్నలతో చేసిన ఇడ్లీ మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

ఇడ్లీ
  • రాగి ఇడ్లీ

కావల్సిన పదార్థాలు : మినపప్పు- ఒక కప్పు, రాగి రవ్వ లేదా రాగి పిండి-ఒక ఒకప్పు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, ఉప్పు తగినంత. ముందుగా మినపప్పును ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. రాగి పిండిని, ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా కలుపుకోవాలి. ఉప్పు వేసి, ఆరు గంటలు పులియ బెట్టుకోవాలి.
తయారీ : ఇడ్లీ ప్లేట్లో కొంచెం నూనె రాసుకుని, ఇడ్లీ పిండిని వేసుకుని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తీసిన ఇడ్లీలు అల్లం పచ్చడి, పల్లీల పచ్చడితో తినొచ్చు. లేదా నేతి కారంపొడితో తిన్నా బాగుంటాయి.
ప్రయోజనం : రాగుల్లో మన శరీరానికి కావలసిన క్యాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి.

  • పాలకూర ఇడ్లీ

కావల్సిన పదార్థాలు : మినపప్పు- ఒక కప్పు, ఇడ్లీ రవ్వ- ఒక కప్పు, పాలకూర- ఒక కప్పు, ఉప్పు తగినంత. ముందుగా మినపప్పును ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మినప్పప్పును మెత్తగా రుబ్బి అందులో ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా కలుపుకోవాలి. ఉప్పు వేసి, ఆరు గంటలు పులియ బెట్టుకోవాలి. పాలకూరను వేడినీళ్లలో ఒక నిమిషం పాటు ఉడకబెట్టి, మెత్తగా గ్రౌండ్‌ చేసుకోవాలి. దీన్ని ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి.
తయారీ : ఇడ్లీ ప్లేట్లో కొంచెం నూనె రాసుకుని, ఇడ్లీ పిండిని వేసుకుని ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడితో తినొచ్చు. లేదా నేతి కారంపొడితో తిన్నా బాగుంటాయి.
ప్రయోజనం : పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్‌ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్స్‌ వంటి ఖనిజాలు క్యాన్సర్‌ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.