Aug 08,2022 13:49

న్యూఢిల్లీ : మరోసారి స్పైస్‌జెట్‌ వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో విమానాలు సరిగ్గా నడపలేక.. ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆదేశాలతో 50 శాతాన్ని మించకుండా సర్వీసులు చేస్తున్న ఈ సంస్థ.. మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌ నుండి ఢిల్లీ వెళ్లిన ప్రయాణీకులకు స్పైస్‌జెట్‌ అసౌకర్యం కల్గించిన ఘటనపై డిజిసిఎ దర్యాప్తుకు ఆదేశించింది. ఆగస్టు 6 రాత్రి వీరంతా హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి ఆరు నిమిషాల పాటు ముందుగా చేరుకున్నా.. బయటకు వచ్చేందుకు కనీసం గంట పట్టింది. దీని కారణం వీరిని టెర్మినల్‌కు తీసుకెళ్లేందుకు ఎయిర్‌లైన్‌ సంస్థ బస్సు సదుపాయాన్ని కల్పించలేదు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సర్వీసును అందించలేదు. దీంతో వారు కాలినడక ద్వారానే టెర్మినల్‌ వైపుకు చేరుకున్నారు. అయితే కోచ్‌లు రావడంతో ఆలస్యమైందని, బస్సులు వచ్చిన తర్వాత, వారిని టర్మక్‌ (తారు రోడ్డు లాంటిది) నుండి టెర్మినల్‌ భవనం వరకు.. వాటిపై ప్రయాణించారని స్పైస్‌జెట్‌ తెలిపింది. తమ సిబ్బంది పలుమార్లు అభ్యర్థన చేసినప్పటికీ.. కొంత మంది ప్రయాణీకులు టెర్మినల్‌ వైపు నడవడం ప్రారంభించేశారని పేర్కొంది. కొంత మందిని కోచ్‌ల సహాయంతో టెర్మినల్‌ వద్ద తరలించామని తెలిపింది. భద్రతా పరమైన కారణంగానే టర్మక్‌పై నడిచేందుకు అనుమతి లేదు.

 <