ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌- భారత అమ్మాయిల ఓటమి

Feb 13,2024 22:20 #Sports

రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిలు చైనా చేతిలోని ఓటమిపాలయ్యారు. బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో చైనాకు పెనాల్టీ లభించడంతో భారత్‌ ఓడింది. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి క్వార్టర్‌లోనే భారత్‌ ఒక గోల్‌ చేసి 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. 7వ నిమిషంలో సంగీత కుమారి ఆ గోల్‌ను చేసింది. ఆ తర్వాత చైనా తరఫున బింగ్‌ ఫెంగ్‌ 14వ నిమిషంలో మరో గోల్‌ చేయడంతో ఇరుజట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్స్‌లో ఇరుజట్లు గోల్స్‌ చేయలేదు. భారత్‌ ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడగా.. నాల్గో క్వార్టర్‌ 53వ నిమిషంలో చైనాకు పెనాల్టీ కార్నర్‌ లభించింది. మ్యాచ్‌ ముగియడానికి రెండు నిమిషాల ముందు చైనాకు పెనాల్టీ స్టోక్‌ లభించడం, దానిని వారు గోల్‌ మలచడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ నెదర్లాండ్స్‌ 4-0 గోల్స్‌ తేడాతో అమెరికాను చిత్తుచేసింది.

➡️