జైస్వాల్‌ ఏ 12కెరీర్‌ బెస్ట్‌ సాధించిన యువ ఓపెనర్‌

Feb 28,2024 22:15 #Sports

ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్ట్‌లో రాణించిన యశస్వి జైస్వాల్‌ కెరీర్‌ బెస్ట్‌ మూడు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ ర్యాంక్‌లో నిలిచాడు. నాల్గో టెస్ట్‌లో జైస్వాల్‌ 73, 37 పరుగులతో రాణించాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ (38, 52 నాటౌట్‌), ధృవ్‌ జురెల్‌ (90, 39 నాటౌట్‌) ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. గిల్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్‌ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్‌ నుంచి టాప్‌-10లో విరాట్‌ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్‌ ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్‌ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్‌ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌ జో రూట్‌ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు.

➡️