తొలి టి20లో ఆసీస్‌ గెలుపు-వెస్టిండీస్‌తో సిరీస్‌

Feb 9,2024 22:20 #Sports

హోబర్ట్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా బెల్వెన్వే వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 11 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 213పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ చివరి బంతి వరకు పోరాడి 8వికెట్లు కోల్పోయి 202పరుగులే చేయగల్గింది. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(70), ఇంగ్లిస్‌(39), టిమ్‌ డేవిడ్‌(37) బ్యాటింగ్‌లో రాణించారు. వెస్టిండీస్‌ బౌలర్లు ఆండీ రస్సెల్‌కు మూడు, జోసెఫ్‌కు రెండు, హోల్డర్‌, షెఫర్డ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ ఓపెనర్‌ కింగ్‌(53) అర్ధసెంచరీకి తోడు ఛార్లెస్‌(42), ఆల్‌రౌండర్‌ హోల్డర్‌(34) బ్యాటింగ్‌లో రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడం జంపాకు మూడు, స్టొయినీస్‌కు రెండు, బెహ్రెన్‌డార్ఫ్‌, మ్యాక్స్‌వెల్‌, అబట్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డేవిడ్‌ వార్నర్‌కు లభించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యతలో ఉండగా.. రెండో టి20 11(ఆది)న ఆడిలైడ్‌ వేదికగా జరగనుంది.

➡️