ఫిట్‌నెస్‌ సాధిస్తేనేకెఎల్‌ రాహుల్‌, జడేజాకు చోటు

Feb 10,2024 22:16 #Sports

శ్రేయస్‌, ఆవేశ్‌, సౌరభ్‌ ఔట్‌..

ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, మహమ్మద్‌ షమీ పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. అవేశ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇక కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. మహ్మద్‌ సిరాజ్‌తోపాటు కొత్తగా ఆకాశ్‌ దీప్‌ టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. అలాగే రజత్‌ పటీధర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. కెఎల్‌ రాహుల్‌, జడేజా విషయంలోనూ తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. మూడో టెస్టు నాటికి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ వస్తేనే వారిద్దరిని తుది జట్టులో ఆడించే అవకాశాలు ఉంటాయని బిసిసిఐ తెలిపింది. ఈ మేరకు బిసిసిఐ వైద్య బృందం నుంచి నివేదికలు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. మూడో టెస్టు రాజ్‌ కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో, ఐదో టెస్ట్‌ మార్చి 7న ధర్మశాలలో జరగనున్నాయి.ఆకాశ్‌కు చోటు.. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికార టెస్ట్‌లో రాణించిన పేసర్‌ ఆకాశ్‌ దీప్‌కు టీమిండియాలో చోటు దక్కింది. బెంగాల్‌కు చెందిన 27ఏళ్ల ఆకాశ్‌.. కేరళతో రంజీమ్యాచ్‌ సందర్భంగా అతడు జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసింది. 2019-20 సీజన్‌లో ఆకాశ్‌ అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడంతో బెంగాల్‌ సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ శుభ్‌మోరు దాస్‌ అతడు తప్పక జాతీయ జట్టుకు ఎంపిక అవుతాడని అప్పట్లోనే తెలిపారు.

జట్టు : రోహిత్‌(కెప్టెన్‌), బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌, కెఎల్‌ రాహుల్‌, పటీదార్‌, సర్ఫరాజ్‌, ధృవ్‌ జురెల్‌, కెఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్లు), అశ్విన్‌, జడేజా, అక్షర్‌, సుందర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ముకేశ్‌, ఆకాశ్‌ దీప్‌.

➡️