‘విజేతల’ ప్రకటనపై రగడ

Feb 9,2024 22:30 #Sports

మహిళల అండర్‌-19 శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌

ఢాకా: అండర్‌-19 శాఫ్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ విజేత ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్వాహకులు చివరకు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సి వచ్చింది. తొలుత నిర్ణీత సమయంలో 1-1తో ఇరుజట్లూ నిలవగా మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అక్కడా ఇరుజట్లు 11-11గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించడంపై నిర్వాహకులు టాస్‌ వేశారు. ఇందులో భారత్‌ గెలిచింది. దీంతో టైటిల్‌ విజేతగా భారత్‌ను నిర్వాహకులు తొలుత ప్రకటించారు. దీనిపై బంగ్లాదేశ్‌ జట్టుతోపాటు అక్కడి అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్‌ మైదానంలోకి రాళ్లు, మంచినీటి సీసాలను విసిరారు. చివరికి ఇరుజట్లను సంయుక్త విజేతగా నిర్ణయిస్తూ ప్రకటన చేయడం గమనార్హం. దాదాపు రెండు గంటల తర్వాత భారత క్రీడాకారిణులను కట్టుదిట్టమైన భద్రత నడుమ మైదానం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎం.సత్యనారాయణ్‌ స్పందించారు. ”స్థానిక అభిమానుల నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు. టాస్‌ ద్వారా విజేతగా తేల్చిన తర్వాత.. బంగ్లా ఫ్యాన్స్‌ మాపై కొన్ని వస్తువులను విసరడం బాధించింది. అధికారులు కూడా మమ్మల్ని విజ్ఞప్తి చేయడంతో సంయుక్త విజేతలుగా ట్రోఫీని అందుకొనేందుకు అంగీకరించాం. మా క్రీడాకారులు, జట్టు సిబ్బందికి భద్రతను కల్పించడమే మా తొలి ప్రాధాన్యం” అని సత్యనారాయణ్‌ స్పష్టం చేశారు.

➡️