సాత్విక్‌-చిరాగ్‌ జోడీకి 3వ ర్యాంక్‌

Jun 11,2024 22:55 #Sports

బిడబ్ల్యుఎఫ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
లాసన్నె: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ 3వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న వీరు తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయారు. మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్‌ వీ కెంగ్‌, వాంగ్‌ చాంగ్‌లు అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. డెన్మార్క్‌ డబుల్స్‌ జోడీ కింగ్‌ అస్ట్రుప్‌, అండర్స్‌ స్కారుప్‌ రస్ముస్సెన్‌కు రెండో స్థానం దక్కింది. థారులాండ్‌ ఓపెన్‌ విజయంతో చిరాగ్‌-సాత్విక్‌ జోడీ నంబర్‌ వన్‌ ర్యాంకుకు ఎగబాకింది. ఆ తర్వాత జరిగిన సింగపూర్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలగడంతో వీళ్ల ర్యాంక్‌ మూడుకు పడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు, లక్ష్య సేన్‌లు టాప్‌ -15లో నిలిచారు. ప్రణయ్ కు 10వ ర్యాంక్‌.. లక్ష్య సేన్‌కు 14వ ర్యాంక్‌ దక్కింది. కిడాంబి శ్రీకాంత్‌ ఏకంగా నాలుగు స్థానాలు కోల్పోయి 32తో సరిపెట్టుకున్నాడు. యువకెరటాలు ప్రియాన్షు రజావత్‌ 34వ, కిరణ గోర్గ్‌ 35వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు తన ర్యాంక్‌ నిలబెట్టుకుంది. రెండేండ్లుగా ఒక్క టైటిల్‌ కూడా గెలవని ఆమె పదో స్థానంలో నిలవగా.. ప్యారిస్‌ ఒలిపింక్స్‌కు అర్హత సాధించిన తనీశా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీ 19వ ర్యాంక్‌లో నిలిచింది.

➡️