మూడు రకాల మట్టితో 86 పిచ్‌లు

Sep 30,2024 04:44 #BCCI, #Cricket, #Sports, #Team India
  • అవుట్‌డోర్‌, ఇండోర్‌లో 45 ప్రాక్టీస్‌ పిచ్‌లు
  • అధునాతన బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆవిష్కరణ
  • 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు

బెంగళూర్‌ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) 16 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. బెంగళూర్‌ శివారు ప్రాంతంలో 40 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో బీసీసీఐ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీని ఆదివారం ప్రారంభించింది. కొత్త ప్రాంగణంలో ఎన్‌సీఏ ఇక నుంచి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఉండనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని, కార్యదర్శి జై షా, ఆఫీస్‌ బేరర్లు రాజీవ్‌ శుక్లా తదితరులు ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. 2025 ప్రథమార్థం నుంచి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ క్రికెటర్లకు అందుబాటులోకి రానుంది. ట్రైనింగ్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌, రిహాబిలిటేషన్‌, ఇంజూరీ మేనేజ్‌మెంట్‌కు ఇక నుంచి బీసీఈ కేంద్రంగా పని చేయనుంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ)ని దశల వారీగా బీసీఈకి తరలించనున్నారు. బిసిసిఐ, కర్ణాటక క్రికెట్‌ సంఘం (కెఎస్‌సిఏ) అభ్యర్థన మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2008లో 40 ఎకరాల భూమి కేటాయించింది. కానీ న్యాయపరమైన చిక్కులతో భూమి బీసీసీఐ చేతికి రాలేదు. 2020లో లీగల్‌ సమస్యలను అధిగమించి 2022 ఫిబ్రవరిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు భూమిపూజ చేశారు. చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలో 2000 నుంచి ఎన్‌సిఏ కొనసాగుతుంది. ఇటువంటి సదుపాయాలు ఇప్పటివరకు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాకు మాత్రమే ఉండేవి. తాజాగా ఆ జాబితాలోకి భారత్‌ సైతం చేరింది.

ముచ్చటగా మూడు గ్రౌండ్లు : ఐసిసి నిబంధనలకు అనుగుణంగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వగల మూడు గ్రౌండ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధాన గ్రౌండ్‌కు అత్యాధునిక ఫ్లడ్‌లైట్లు, సబ్‌ ఎయిర్‌ డ్రైనేజీ వ్యవస్థ, ప్రసార సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముంబయి నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో 13 ఎర్ర మట్టి పిచ్‌లను తయారు చేశారు. ఇక నుంచి భారత్‌-ఏ జట్టు మ్యాచులను ఇక్కడే నిర్వహించనున్నారు. గ్రౌండ్‌ బి, సిలు ప్రాక్టీస్‌ మైదానాలుగా ఉంటాయి. ఈ రెండు గ్రౌండ్స్‌లో కర్ణాటకలోని మాండ్య, ఒడిశాలోని కల్హానండి నుంచి తెప్పించిన నల్ల మట్టితో పిచ్‌లు తయారు చేశారు.

ప్రపంచ శ్రేణి ఇండోర్‌ సదుపాయం : సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ప్రపంచ శ్రేణి ఇండోర్‌ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇండోర్‌ ట్రైనింగ్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన మట్టితో పిచ్‌లు తయారు చేశారు. దేశవ్యాప్తంగా తెప్పించిన మూడు రకాల మట్టితో 45 ప్రాక్టీస్‌ పిచ్‌లను సిద్ధం చేవారు. స్పోర్ట్స్‌ సైన్స్‌, మెడిసిన్‌ బ్లాక్‌ సహా బస చేసేందుకు క్యాంపస్‌లో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ సహా స్విమ్మింగ్‌పూల్‌, రికవరీ సౌకర్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. క్రికెటేతర అథ్లెట్లకు సైతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇండోర్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 40 ఎకరాల క్యాంపస్‌లో భవిష్యత్‌ ప్రణాళికల కోసం ఏడు ఎకరాలను ఖాళీగా ఉంచారు.

నైపుణ్య కేంద్రం : ఎన్‌సిఏ అనగానే అందరూ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ అనుకుంటారు. గాయం నుంచి కోలుకునేందుకు మాత్రమే క్రికెటర్లు ఇక్కడకు వస్తారని భావిస్తారు. కానీ క్రికెటర్లు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, స్కిల్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఎక్కువగా ఎన్‌సీఏలో అడుగుపెడతారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ రాకతో ఇక నుంచి మరిన్ని శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆస్కారం ఉంటుంది. అండర్‌-15 బాలికలు, అండర్‌-15 బార్సు విభాగంలో ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్‌సీఏ నిర్వహించిన 32 క్యాంప్‌లు దేశవ్యాప్తంగా భిన్న వేదికల్లో జరిగాయి. ఇక నుంచి క్యాంప్స్‌ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లోనే నిర్వహిస్తాం. భారత-ఏ జట్ల మ్యాచులకు సైతం ఈ గ్రౌండ్‌ను వినియోగిస్తామని ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు.

ఏ పరిస్థితుల్లోనైనా రాణించేలా : సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో అతిముఖ్యమైన అంశం.. మూడు రకాల మట్టితో తయారు చేసిన పిచ్‌లు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లు భిన్న పరిస్థితులకు అలవాటు పడేందుకు.. ఎన్నో ప్రదేశాలకు ప్రయాణం చేసి సాధన చేయాల్సి వచ్చేది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న మట్టి, పిచ్‌లను అధ్యయనం చేసి ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ సాధన చేసి క్రికెటర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. వర్థమాన క్రికెటర్లకు మాత్రమే కాదు ప్రస్తుత క్రికెటర్లకు సైతం ఇది ఒక వరమని చెప్పవచ్చు. ప్రపంచంలో నేను ఎన్నో అకాడమీలు చూశాను. అందులో ఇతర క్రీడలకు సంబంధించిన అకాడమీలు సైతం ఉన్నాయి. కానీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ తరహా స్పోర్ట్స్‌ అకాడమీని ఎక్కడా చూడలేదని లక్ష్మణ్‌ అన్నారు.

➡️