Cuba: ఒలింపిక్స్‌లో క్యూబాకు 9 పతకాలు

ధీటుగా పోరాడిన వియత్నాం

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కమ్యూనిస్టు దేశాల్లో ఒకటైన క్యూబా 9 పతకాలు సాధించింది. ఇందులో 2స్వర్ణ, ఒక రజతాలతో సహా ఆరు కాంస్య పతకాలున్నాయి. రెజ్లింగ్‌, బాక్సింగ్‌లో క్యూబాకు స్వర్ణ పతకాలు దక్కితే.. ఏకైక రజత పతకం మహిళల 50కిలోల రెజ్లింగ్‌లో గూజ్మన్‌ సాధించింది. ఈమె సెమీస్‌లో వినేశ్‌ ఫోగాట్‌(భారత్‌) చేతిలో ఓడినా.. అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌కు చేరి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల బాక్సింగ్‌(80కిలోలు), రెజ్లింగ్‌(97కిలోలు), 67కిలోలు, మహిళల 76 కిలోల కేటగిరీలతోపాటు తైక్వాండో, కానోయింగ్‌లలో కాంస్య పతకాలు దక్కాయి. మొత్తం 61మంది అథ్లెట్లతో పారిస్‌ ఒలింపిక్స్‌లో అడుగిడిన క్యూబా తరఫున 34మంది పురుషులు, 27మంది మహిళా అథ్లెట్లు అర్హత సాధించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్యూబా.. 15పతకాలతో సత్తా చాటింది. ఇందులో రెజ్లింగ్‌(2), కనోయింగ్‌(1), బాక్సింగ్‌(4) స్వర్ణ పతకాలు దక్కితే.. జూడో, అథ్లెటిక్స్‌, షూటింగ్‌లలో ఒక్కో రజత పతకం దక్కింది. అలాగే తైక్వాండో, లాంగ్‌జంప్‌, డిస్కస్‌ త్రో, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్య పతకం దక్కాయి. 144కోట్ల జనాభా ఉన్న భారత్‌ కేవలం 6పతకాలకే పరిమితమైతే.. కేవలం 1.20 కోట్ల జనాభా ఉన్న క్యూబా 9 పతకాలు సాధించడం విశేషం.

పారిస్‌లోనూ వియత్నాంకు నిరాశే..
కమ్యూనిస్టు దేశాల్లో ఒకటైన వియత్నాం తరఫున 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ 16మంది అథ్లెట్లు అర్హత సాధించారు. వారిలో నలుగురు పురుషుల కేటగిరీకి, మరో 12మంది కేటగిరీలో వియత్నాం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కనోయింగ్‌, సైక్లింగ్‌, జూడో, రోయింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వారు అర్హత సాధించారు. ఇద్దరు మహిళా బాక్సర్లు ఓ-టిన్‌ కిమ్‌, హా-థి-లిన్‌ ప్రి క్వార్టర్స్‌ వరకు చేరగలిగారు. అథ్లెటిక్స్‌ మహిళల 200మీ. కేటగిరీలో నుయాన్‌ థీ హీట్స్‌లో గెలిచి క్వార్టర్‌ఫైనల్లో ఓడింది. జూడోలో రౌండ్‌-32, రోయింగ్‌లో 23వ, షూటింగ్‌లో 7వ స్థానంలో నిలువగలిగారు. స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌ దాటి ముందుకెళ్లలేకపోయారు. మొత్తమ్మీద 2020, 2024 ఒలింపిక్స్‌లో వియత్నాంకు ఒక్క పతకం కూడా దక్కలేదు గానీ చిన్న దేశమైన అగ్రదేశాలకు ధీటుగా పతకాల సాధనకు ప్రయత్నించడం విశేషం.

➡️